స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం నెల్లూరులోని తన నివాసంలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఏఎస్ పేట, సంగం, చేజర్ల మండలాలకు చెందిన నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, మండల స్థాయి పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ఏఎంసీ, పీఏసీఎస్ అధ్యక్షులు, వాటర్ యూజర్స్ అసోసియేషన్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి చేరవేయాలని నాయకులకు సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఫలితాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ప్రభుత్వంపై ప్రజలకు మరింత నమ్మకం కలిగించేలా కృషి చేయాలన్నారు.
ఆత్మకూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కంకణబద్ధమై ఉందని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల అమలుకు ప్రత్యేక చొరవ తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయిలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సాధ్యమైన చోట సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యేలా కృషి చేయాలని, కూటమి అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థుల విజయానికి నాయకులందరూ సమష్టిగా చొరవ తీసుకోవాలని సూచించారు.
పార్టీ నాయకుల మధ్య ఐక్యత, పరస్పర సహకారం ఎంతో ముఖ్యమని, వ్యక్తిగత అభిప్రాయ భేదాలకు తావులేకుండా పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని మంత్రి ఆనం కోరారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులందరూ ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.తొలుత మంత్రి ఆనం, నాయకులు ఎన్ టి ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నూతనంగా ఎన్నికైన జెడ్పిటిసి, ఎంపిటిసి సభ్యులను మంత్రి రామనారాయణ రెడ్డి అభినందించారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు తాళ్లూరు గిరినాయుడు, కాటంరెడ్డి రవీంద్రా రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ అబ్బూరు రమేష్ నాయుడు, టిడిపి పరిశీలకులు ఎస్. మోహన్ రెడ్డి, సంగం మండల తెలుగుదేశం అధ్యక్షుడు బాణా శ్రీనివాసులురెడ్డి, సొసైటీల చైర్మన్లు గుండ్లపల్లి శ్రీనివాస యాదవ్, కాటంరెడ్డి నరసింహా రెడ్డి, తెలుగుదేశం నాయకుడు చల్లా రవికుమార్ రెడ్డి,పులిమి సుధాకర్ రెడ్డి,ఏఎస్ పేట, సంగం, చేజర్ల మండలాలకు చెందిన నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ఏఎంసీ, పీఏసీఎస్ అధ్యక్షులు, వాటర్ యూజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.