ఎన్నికల వేళ పోలీసుల విస్తృత తనిఖీలు
* గూడెపువలస, బైరెడ్డిపాలెం, దల్లిపేటలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
* నాలుగు ద్విచక్ర వాహనాలు సీజ్..
* సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు
భోగాపురం, (మేజర్ న్యూస్): రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా భోగాపురం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల సమయంలో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు గ్రామాల్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు పోలీసు యంత్రాంగం తనిఖీలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా భోగాపురం సీఐ ఏ. రవికుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మండలంలోని గూడెపువలస, బైరెడ్డిపాలెం, దల్లిపేట గ్రామాల్లో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులను విచారించడంతో పాటు వాహనాలు, అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల రికార్డులు, సంబంధిత ఆధారాలను పరిశీలించారు. సరైన ఆధారాలు లేని నాలుగు ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో నిరంతర నిఘా కొనసాగిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు. ఈ తనిఖీల్లో సబ్ ఇన్‌స్పెక్టర్లు రమేష్, రామారావుతో పాటు భోగాపురం పోలీస్‌స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్: వై.శ్రీనివాస్, భోగాపురం.