ఎంపీపీ, జెడ్పీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
పల్నాడు జిల్లాలో నవంబర్ 19, 20 తేదీల్లో నిర్వహించనున్న మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ), జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీ) అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కోఆప్టెడ్ సభ్యుల పరోక్ష ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి మంగళవారం నిర్వహించిన వెబెక్స వీడియో కాన్పెరెన్సు ద్వారా ఎన్నికల సన్నద్ధత, విధివిధానాలు, ఏర్పాట్లపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. ప్రిసైడింగ్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు, జడ్పీ అధికారులకు ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలు, విధులపై దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నవంబర్ 19వ తేదీన మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు, నవంబర్ 20వ తేదీన జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో అర్హులైన సభ్యులు చేతులెత్తే విధానం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని వివరించారు.ఎన్నికల సమావేశాల నిర్వహణకు ఎన్నికైన సభ్యులలో సగం మంది హాజరుతో కోరం ఏర్పడుతుందని కలెక్టర్ తెలిపారు. నిర్ణీత సమయానికి కోరం లేని పక్షంలో ఒక గంట వరకు వేచి చూడాలని, అప్పటికీ కోరం సమకూరకపోతే ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేయాలని సూచించారు. మరుసటి రోజు కూడా ఎన్నిక నిర్వహణ సాధ్యం కాని పరిస్థితుల్లో తదుపరి ఎన్నికల తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని తెలిపారు. ఎన్నికల సమావేశాలకు సంబంధిత సభ్యులు, నిబంధనల ప్రకారం అర్హులైన ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా ఇతర వ్యక్తులను అనుమతించరాదని స్పష్టం చేశారు. సంబంధిత మండలానికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, ఆ మండలంలో ఓటు హక్కు కలిగిన ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరుకావచ్చని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశాన్ని ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని, అధికారులకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు, లోటుపాట్లకు తావులేకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు అర్హతలు. ఎన్నికల ప్రక్రియలో ముందుగా కోఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మతపరమైన మైనారిటీలైన ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందినవారు, అలాగే తెలుగు భాష మినహా ఇతర భాషలను మాతృభాషగా కలిగిన వారు భాషాపరమైన మైనారిటీలుగా అర్హులవుతారని వివరించారు. కోఆప్టెడ్ సభ్యులుగా పోటీ చేయదలచిన వారు తమ మైనారిటీ అర్హతను ధ్రువీకరించే పత్రాన్ని ఎంపీ, ఎమ్మెల్యే లేదా గెజిటెడ్ అధికారి నుంచి పొంది సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.నవంబర్ 19వ తేదీన నిర్వహించే ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికలకు సంబంధించి ఉదయం 10 గంటలలోపు నామినేషన్లు లేదా ఫారం A, B లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలలోపు నామినేషన్ల పరిశీలన పూర్తి చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగుస్తుంది. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహిస్తారు.అదేవిధంగా నవంబర్ 20వ తేదీన నిర్వహించే జెడ్పీ కోఆప్టెడ్ సభ్యులు, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలకు కూడా ఇదే విధమైన సమయపాలన పాటించాలని కలెక్టర్ సూచించారు. ఉదయం 10 గంటలలోపు నామినేషన్ల స్వీకరణ, మధ్యాహ్నం 12 గంటలలోపు పరిశీలన, ఒంటి గంటలోపు ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహిస్తారు.ఎన్నికల సమావేశాలకు అవసరమైన కోరం గెలుపొందిన సభ్యులలో సగం మంది హాజరుతో ఏర్పడుతుందని కలెక్టర్ తెలిపారు. నిర్ణీత సమయానికి కోరం లేని పక్షంలో ఒక గంట వరకు వేచి చూడాలని, అప్పటికీ కోరం సమకూరకపోతే ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేయాలని సూచించారు. మరుసటి రోజు కూడా ఎన్నిక నిర్వహించడం సాధ్యం కాని పరిస్థితుల్లో తదుపరి ఎన్నికల తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని తెలిపారు.
ఎన్నికల సమావేశాలకు సంబంధిత సభ్యులు, నిబంధనల ప్రకారం అర్హులైన ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా ఇతర వ్యక్తులను అనుమతించరాదని స్పష్టం చేశారు. సంబంధిత మండలానికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, మండలం లో ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరుకావచ్చని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశాన్ని నిబంధనల ప్రకారం చేపట్టాలని, విధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి పొరపాట్లకు, లోటుపాట్లకు తావులేకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కిరణ్ కుమార్, పల్నాడు జిల్లా ప్రతినిధి