మట్టి నమూనా ఆధారంగానే ఎరువులు వాడాలి
నగరం, మేజర్ న్యూస్:
రైతులు అధిక దిగుబడి కోసం విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడటంతో నేల సారం దెబ్బతినడమే కాకుండా, పెట్టుబడి ఖర్చు కూడా పెరుగుతుదని, ప్రతి రైతు తప్పనిసరిగా మట్టి పరీక్ష చేయించుకొని, సాయిల్ హెల్త్ కార్డు ఆధారంగా మాత్రమే ఎరువులు వాడాలని ఇంచార్జీ రేపల్లె సహాయ వ్యవసాయ సంచాలకులు, స్థానిక మండల వ్యవసాయ అధికారి వేమూరి రమేష్ బాబు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ధూళిపూడి నార్త్ గ్రామంలో రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పంట కోత తర్వాత పొలంలో 5 నుండి 6 చోట్ల వి ఆకారంలో 15 సెం.మీ. లోతున మట్టిని సేకరించాలని, అందులో నుంచి అర కిలో మట్టిని శుభ్రమైన కవర్ లో ఎస్ ఆర్ కె ద్వారా మట్టి పరీక్ష కేంద్రానికి పంపాలన్నారు. 7 రోజుల్లో సాయిల్ హెల్త్ కార్డు అందజేస్తామని, నేల ఆరోగ్యం కోసం సాయిల్ హెల్త్ కార్డులో సూచించిన మోతాదులో మాత్రమే ఎన్.పి.కే. ఎరువులు వాడాలన్నారు. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ తప్పనిసరిగా వాడాలన్నారు. జింక్, బోరాన్ లోపం ఉన్న భూముల్లో సూక్ష్మ పోషకాలు వాడటం వలన 15% అదనపు దిగుబడి వస్తుందన్నారు. పచ్చిరొట్టె పంటలైన జీలుగ, జనుము వేయడం వలన భూసారం పెరుగుతుందని, మరిన్ని వివరాలకు రైతు సేవ కేంద్రంలో కానీ, మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి కె. నాగ శ్రీనివాసరావు, గ్రామ వ్యవసాయ సహాయకురాలు స్వాగత లక్ష్మీ, రైతులు పాల్గొన్నారు.