మంత్రి తుమ్మల ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతాం..* మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు…
సూర్య,దమ్మపేట,రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారాలను వెంటనే నిలిపివేయాలని జిల్లా సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి తుమ్మల అన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.
రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని గానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై గానీ మంత్రి తుమ్మల ఎక్కడా మాట్లాడలేదని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కరువు తర్వాత అధికార పార్టీ గెలిచిన దాఖలాలు లేవని, గతంలో హైటెక్ సిటీ నిర్మించిన చంద్రబాబు నాయుడు సైతం కరువు తర్వాత ఓటమి పాలయ్యారని తుమ్మల అన్నట్లు కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే, మంత్రి తుమ్మల అనని మాటలను అన్నట్లుగా వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో అనవసర గందరగోళం సృష్టించేందుకు ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తుమ్మలపై జరిగే ఏ చిన్న తప్పుడు ప్రచారాన్నైనా కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా తిప్పికొడతాయని పైడి వెంకటేశ్వరరావు తేల్చి చెప్పారు.
సూర్య రిపోర్టర్ దస్తగిర్ దమ్మపేట