telangana
అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు - ప్రజల ఆత్మగౌరవమే ప్రజాపాలన ప్రభుత్వ ధ్యేయం - మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
Telangana
17 Nov 2026
28 views
సూర్య, మందమర్రి : సమాజంలోని పేదలు, నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజాపాలన ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. మండల పరిధి గద్దెరాగడిలోని ఎన్వీఆర్ గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించిన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలతో పాటు మండల పరిధిలోని లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా కొత్త పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు రేషన్ కార్డులు, పింఛన్లు అందించడంలో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. ప్రజాపాలనలో సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి వంటి పథకాలతో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పింఛన్లు పొందుతున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఎవరి మీదా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. రాజకీయ భేదాలు పక్కనపెట్టి అర్హత, పేదరికం ఆధారంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నట్లు వివరించారు. దీపావళి నాటికి రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, రానున్న మూడేళ్లలో మరో రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలిపేందుకు సుమారు రూ.800 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. గ్రామాలు, పట్టణాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు వెచ్చిస్తున్నామన్నారు. రూ.100 కోట్ల అమృత్ పథకం ద్వారా తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నామని, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. చెన్నూరులో 100 పడకల ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉందని, మందమర్రిలో మరో 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మందమర్రి ఏజెన్సీ ప్రాంతంలో గృహ నిర్మాణానికి ఎదురవుతున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ఆరు ఎకరాల భూమిని కేటాయించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో కొత్త బొగ్గు గనుల ఏర్పాటుకు గత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం ఆర్కే ఓసీలో కొత్త బొగ్గు గని ఏర్పాటు కానుండటంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం రూ.70 కోట్లతో అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నామని తెలిపారు. బొక్కలగుట్ట, అందుగులపేట, సండ్రులపల్లె, పులిమడుగు గ్రామాల్లో కల్వర్టుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. నియోజకవర్గంలో రూ.80 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని, నీరు, విద్యుత్‌ను అవసరమైన మేరకే వినియోగిస్తూ పొదుపు పాటించాలని కోరారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 33 శాతం పెరిగిందని పేర్కొంటూ, భవిష్యత్తులో ఎదురయ్యే కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. కరోనా సంక్షోభాన్ని అధిగమించిన స్ఫూర్తితో ఎల్‌నినో సవాళ్లను కూడా ఎదుర్కోవాలని అన్నారు. సంక్షేమం, విద్య, వైద్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధిని సమన్వయం చేస్తూ చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ట్యాగ్లు:
Latest News