భిక్షాటనలో లింగాల ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు
లింగాల: ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ సెక్యూరిటీ పేషెంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచాలని, పండగ, జాతీయ సెలవులు ఇవ్వాలని, కాలం చెల్లిన ఏజెన్సీలను రద్దు చేయాలని, కార్పొరేషన్ ద్వారా నేరుగా ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని తదితర డిమాండ్ల సాధనకై గత ఆరు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా జరుగుతున్న ఆసుపత్రి కార్మికుల ఆందోళనలో భాగంగా లింగాల మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్ర పారిశుధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, సూపర్వైజర్ కార్మికులు తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నేతృత్వంలో వినూత్నంగా చేతిలో చిప్పలు పట్టుకొని భిక్షాటన చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికులు మాట్లాడుతూ కాంట్రాక్టు పారిశుద్ధ సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ ప్రభుత్వ ఆసుపత్రుల కార్మికులకు గత ఐదు సంవత్సరాలుగా జీతాలు పెరగలేదని వాపోయారు. అతి కీలకమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థ వైద్య ఆరోగ్య శాఖలో ఏళ్ళ తరబడి కనీస వేతనాలకు నోచుకోక వెట్టి చాకిరికి గురవుతున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచాలని ఏజెన్సీలను రద్దు చేయాలని అనేక పర్యాయాలు వివిధ రూపాలలో ఆందోళనలు నిరసనలు విజ్ఞాపన పత్రాలు అధికారులకు ప్రభుత్వానికి అందజేసిన పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. స్వరాష్ట్ర పాలనలో దవఖాన కార్మికులకు దగా తప్పలేదని నేటి ప్రజా పాలనలో కూడా కార్మికులకు అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. కావున ప్రభుత్వం మానవత దృక్పథంతో పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ సూపర్వైజర్ కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచి ప్రభుత్వ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు కార్మికులు కాట్రాజ్ ఈశ్వర్, గద్ద బాలరాజ్, మహమ్మద్ జలీల్, మల్లేష్ ,సందీప్, భీమన్న,చంటి, చంద్రకళ, రామేశ్వరమ్మ,జ్యోతి, మంజుల,నిర్మల, మంగమ్మ,గీత తదితరులు పాల్గొన్నారు.