26న ఎంటిఎంసీ, పొన్నూరు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఎన్నికల 29, డిసెంబర్ 2న పోలింగ్: కలెక్టర్
గుంటూరు: గుంటూరు జిల్లాలో ఇప్పటికే గుంటూరు, తెనాలి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించా మని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సహకరించిన ఓటర్లు, ప్రజలు, గుంటూరు జిల్లా ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంటిఎంసీ), పొన్నూరు మున్సిపాలిటీలకు నవంబర్ 26వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోందని తెలిపారు. ఎంటిఎంసీ, పొన్నూరు మున్సిపాలిటీల ఎన్నికలు మరియు పంచాయతీ ఎన్నికల వివరాలను తెలియ జేసేందుకు కలెక్టరేట్లో మంగళవారం జిల్లా కలెక్టర్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఎంటిఎంసీ లో 62 వార్డులు, పొన్నూరు మున్సిపాలిటీలో 40 వార్డులు కలిపి మొత్తం 102 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎంటిఎంసీ లో 261, పొన్నూరులో 84 కలిపి మొత్తం 345 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.ఈ రెండు పట్టణ స్థానిక సంస్థల్లో కలిపి మొత్తం 2,97,913 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఎంటిఎంసీ లో 2,37,713 మంది, పొన్నూరులో 60,200 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. పోలింగ్ నిర్వహణకు ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లతో కలిపి సుమారు 2,201 మంది సిబ్బందికి విధులు కేటాయించామని తెలిపారు. వారికి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం శిక్షణ నిర్వహిస్తున్నామని, నవంబర్ 25వ తేదీన సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో రిపోర్ట్ చేసి 26వ తేదీన పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.ఎంటిఎంసీలో మేయర్ పదవికి 21 నామినేషన్లు, పొన్నూరు మున్సిపాలిటీ లో చైర్పర్సన్ పదవికి 10 నామినేషన్లు దాఖల య్యాయని కలెక్టర్ తెలిపారు. వార్డు సభ్యుల పదవులకు ఎంటిఎంసీలో 569, పొన్నూరులో 200 నామినేషన్లు దాఖలైనట్లు వివరించారు.నవంబర్ 26వ తేదీన పోలింగ్ నిర్వహించిన అనంతరం నవంబర్ 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టను న్నట్లు తెలిపారు. ఎంటిఎంసీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేశామని, పొన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి జీబీసీ రోడ్డులోని సెయింటెన్స్ స్కూల్లో రిసెప్షన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రిని సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. ఎంటిఎంసీ, పొన్నూరు ప్రాంతాల్లో నవంబర్ 21, 22 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎన్నికల విధులకు సంబంధించిన పోస్టింగ్ ఆర్డర్‌ను తీసుకొని ఫెసిలిటేషన్ కేంద్రానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.జిల్లాలో రెండు, మూడో దశల్లో మొత్తం 208 గ్రామ పంచాయతీలు, 2,208 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ రెండు దశల్లో కలిపి మొత్తం 5,88,453 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వెల్లడించారు. రెండో దశలో నవంబర్ 29వ తేదీన చేబ్రోలు, పొన్నూరు, తెనాలి, పెదకాకాని మండలాల్లోని 87 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ దశలో 1,008 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.మూడో దశలో డిసెంబర్ 2వ తేదీన గుంటూరు రూరల్, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, మేడికొండూరు, వట్టిచెరుకూరు, కాకుమాను, దుగ్గిరాల మండలాల్లోని 121 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ దశలో 1,309 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోందని పేర్కొన్నారు.జిల్లాలో పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ప్రజలు, ఓటర్లు సహకరించాలని కోరారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఎంటిఎంసీ, పొన్నూరు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్హులైన ఓటర్లందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు.ఈ పాత్రికేయ సమావేశం లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్ ఎస్ కె. ఖాజావలి పాల్గొన్నారు.
సూర్య నాయక్