ఉత్తరాంధ్రపై తుఫాను పంజా..!
145 కి.మీ. వేగంతో విరుచుకుపడనున్న పెనుగాలులు
21 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే ప్రమాదం.. 19, 20 తేదీల్లో అప్రమత్తత తప్పనిసరి
విశాఖపట్నం : సూర్య
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడుతూ తుఫానుగా మారనుండటంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. తుఫాను తీవ్రరూపం దాల్చి గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తాంధ్రలో విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ప్రస్తుతం తీవ్ర వాయుగుండం విశాఖపట్నానికి ఆగ్నేయ దిశలో సుమారు 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి తుఫానుగా, అనంతరం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నవంబర్ 18 నుంచి కోస్తాంధ్రలో వర్షాల తీవ్రత పెరిగి, 19, 20 తేదీల్లో పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే ప్రమాదం ఉంది.
ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో 21 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
సముద్రంలోకి వెళ్లొద్దు.. మత్స్యకారులకు హెచ్చరిక
తుఫాను ప్రభావంతో నవంబర్ 19 నుంచి సముద్రం అత్యంత అల్లకల్లోలంగా మారే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు సురక్షితంగా తీరానికి చేరుకోవాలని సూచించింది.
పోర్టులకు ప్రమాద హెచ్చరికలు
విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నంబర్–1 జారీ చేశారు. గంగవరం, కాకినాడ పోర్టులకు అదనంగా సెక్షన్ సిగ్నల్ నంబర్–5 జారీ చేశారు. తుఫాను కదలికలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ముందస్తు చర్యలకు ఆదేశాలు
భారీ వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, సహాయక బృందాలు, ముందస్తు భద్రతా ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలని వాతావరణ శాఖ సూచించింది. తుఫాను ప్రభావంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని హెచ్చరించింది.