BREAKING
చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలు ప్రారంభం అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి వర్షిత్‌కు జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కలిసికట్టుగా పని చేద్దాం సర్పంచ్ ఎన్నికల్లో గెలుద్దాం ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి సభకు సిద్దిపేటలో ఏర్పాట్లు షురూ! బ్రహ్మాసముద్రం మండలం,ఎరిడికేరా సర్పంచ్ అభ్యర్థి గా గాజుల కుమార్ ఎన్నిక. పీఎం శ్రీ పాఠశాలలో కెరీర్ గైడెన్స్, బాలికా సాధికారత, అడోలసెంట్ క్లబ్ కార్యక్రమాలు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు శ్రీ కాళహస్తి మున్సిపాలిటీ చైర్మన్ కొరకు సర్వే కూరగాయల సాగుతో అదనపు ఆదాయం ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కూటమి విజయంతో రాష్ట్రానికి ఆదర్శం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధ్యానంతో మానసిక ప్రశాంతత.. అహింసా జగత్‌ పిరమిడ్‌ ధ్యాన ఆశ్రమం ప్రారంభం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మంటలు ఆర్బీఐ రెడ్ లైన్ దాటిన రిటైల్ ద్రవ్యోల్బణం: అక్టోబర్‌లో రెండేళ్ల గరిష్టం 6.09% నమోదు

గ్రంథాలయాలు విజ్ఞానాలయాలు

Select Suryaa Now
గ్రంథాలయాలు విజ్ఞానాలయాలు

నవంబర్ 14 నుండి గ్రంథాలయాల వారోత్సవాల సందర్భంగా..,

‎‎సాహిత్య వ్యాసం | జాతీయ గ్రంథాలయ వారోత్సవ ప్రత్యేక ప్రచురణ

‎‎రచన: అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు

‎సెల్: 8247433432

గ్రంథాలయ ప్రాముఖ్యతపై ప్రముఖ సూక్తులు:

‎"చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో"

‎"మంచి పుస్తకం మంచి మిత్రునితో సమానం"

‎"పుస్తకాన్ని మించిన మంచి మిత్రుడు లేదు"

‎"సత్ కాలక్షేపానికి మంచి పుస్తకం ఎంచుకో"

‎ఎక్కువగా పుస్తకాలుండే చోటుని 'గ్రంథాలయం' (లైబ్రరీ) అంటారు. గ్రంథి అనగా ముడి. పూర్వము తాటి ఆకుల మీద రాసి వాటిని ఒక తాటి తో గుచి ముడివేసేవారు. అందుకు వాటిని గ్రంథాలు అన్నారు. వాటినే ఇప్పుడు మనం పుస్తకాలు అంటున్నాము. తరతరాల విజ్ఞాన సంపదలను అందించేవి గ్రంథాలు. అటువంటి గ్రంథాలు గల భవనాన్ని గ్రంథాలయం అంటారు. వీటినే 'విజ్ఞానాలయాలు, పఠన మందిరములు' ఆంగ్లంలో 'లైబ్రరీ' అని కూడా అంటారు. 'లైబ్రరీ' అనేమాట 'లైబర్' అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. ఆ పదానికి అర్థం 'పుస్తకం'. ఎక్కువ సంఖ్యలో పుస్తకాలు ఒక చోట భద్రపరచటానికి, అందరూ చదువుకోటానికి వీలయ్యే ప్రదేశాన్ని లైబ్రరీ అంటారు.

‎

‎ఈ 'లైబ్రరీ'లు అస్సీరియా, బాబిలోనియాలలో క్రీస్తు పూర్వం 200 సంవత్సరం నాటికే ఉండేవని తెలుస్తోంది. 'మెసపటేమియా'లో మట్టిని పలకలు గా చేసి వాటిపై 'ఎక్యూనియన్' అనబడే ఒక గట్టి కర్రలాంటి దానితో రాసేవారు. వారు రాసిన లిపిని 'క్యూనిఫారం' అనేవారు. ఈ మట్టి పలకలలో మంచి వాటిని, ఉపయోగం ఉన్న వాటిని జాగ్రత్తగా భద్రపరిచేవారు. ఇలాంటి వాటిని వేలాదిగా ఒక భవనంలో గాని, దేవాలయాలలో గాని ఉంచేవారు. అలాంటప్పుడు వాటిని సబ్జెక్టులవారీగా విభజించేవారు. ప్రాచీన ఈజిప్టులో కూడా ఇలాంటి లైబ్రరీలు దేవాలయాలలో ఉండేవి. అవి మతాచార్యుల అధీనంలో ఉండేవి. వాటిని 'పాపిరస్' అనబడే ఒక రకపు పల్చని పొరపై రాసేవారు. రాసాక వాటిని ఒక చుట్టగా చుట్టి భద్రపరిచేవారు అని పరిశోధకులు చెబుతున్నారు.

‎

‎మన భారతదేశంలో ప్రాచీన కాలంలో రాగి రేకుల పైననూ, తాటి ఆకుల పైననూ (తాళపత్ర గ్రంథాలు) రాసి భద్రపరిచే వారు. ప్రాచీన లైబ్రరీలో అతి పెద్దది ఈజిప్టులోని 'అలెగ్జాండ్రియా'లో ఉన్నది. అది క్రీస్తు పూర్వం 300 సంవత్సరాలనాటిది. ఈ లైబ్రరీలో 7 లక్షల 'పాపిరస్' చుట్టలుండగా వాటిని 120 తరగతులుగా విభజించారు. ఈ లైబ్రరీలో అందరూ చదువుకునేందుకు వీలుండేది కాదు. అందరూ చదువుకునే వీలుండే పబ్లిక్ లైబ్రరీలను స్థాపించాలనే కోరిక మొదటిసారిగా రోమన్లకు వచ్చింది. జూలియస్ సీజర్ మొదటి సారిగా రోమ్ నగరంలో పబ్లిక్ లైబ్రరీలు స్థాపించి డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి పుస్తకాలను సేకరించి సొంత లైబ్రరీలు ప్రారంభించారు. రోమ్ నగరంలో 28 లైబ్రరీలుండేవని చరిత్రకారులు చెబుతున్నారు.

‎

‎తర్వాత కాలంలో క్రిస్టియన్ మతం ప్రచారంలోనికి వచ్చిన తర్వాత దాదాపు అన్ని చర్చిలలో చిన్న చిన్న మత సంబంధ లైబ్రరీలు స్థాపించారు. ఫ్రాన్స్ లోని పారిస్ విశ్వవిద్యాలయంలోనూ, జర్మనీలోని హెడెల్బర్గ్ విశ్వవిద్యాలయంలోనూ లైబ్రరీలు ప్రారంభించగా భారతదేశంలో నలందా విశ్వవిద్యాలయంలో పెద్ద లైబ్రరీ ప్రారంభించారు.

‎

‎ఈనాడు ప్రపంచంలో అతి పెద్ద లైబ్రరీ వాషింగ్టన్ లో కాంగ్రెస్ కొండ వద్ద ఉన్నది. జేమ్స్ మాడిసన్ స్మారక భవనంలో గల 'లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్'లో 1986 నాటికి 9 కోట్లు విభాగాలతో 2 కోట్లు పుస్తకాలు, మరికొన్ని రాత ప్రతులు, పురాతన గ్రంథాలు, ఫోటోగ్రాఫ్‌లతో ఈ 'లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్' పెద్ద లైబ్రరీగా ఖ్యాతి గడించింది. ఈ భవనంలోని అరలు వరుసగా పేరిస్తే 532 మైళ్ళ పొడవు వస్తుందని పారిశోధక పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచంలో మరో పెద్ద లైబ్రరీగా చెప్పదగినది న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ. 1895 లో 5,22,276 చదరపు అడుగుల వైశాల్యంతో న్యూయార్క్ నగరంలో ఐదవ ఎవెన్యూలో న్యూయార్క్ లైబ్రరీ ప్రారంభమైంది. ఇందులో ని అరలు 88 మైళ్ళ పొడవు ఉంటాయి. దీనికి 80 బ్రాంచి లైబ్రరీలున్నాయి. ఈ లైబ్రరీలో 5కోట్ల 20 లక్షల వార్తాపత్రికలు, 5లక్షలకు పైగా రాత ప్రతులు, మూలకమైన లక్షల మ్యాప్‌లు ఉన్నాయని పరిశోధకులు చెప్పారు. ఇంకో మోడ్రన్ ప్రాంగణంలోని 'లెనిన్' లైబ్రరీ, ఇందులో దాదాపు 2 కోట్ల పుస్తకాలున్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయం.

‎

‎ఇంతటి ప్రాముఖ్యతను కలిగి ఉన్న గ్రంథాలయాలు, వాటి ఆవశ్యకతను తెలుసుకుని మన తెలుగు రాష్ట్రాలలో గ్రంథాలయాల స్థాపనకు అయ్యదేవర వెంకట రమణయ్య, గాడిచర్ల హరి సర్వోత్తమరావు, నాళం కృష్ణారావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి ఎందరో మరెందరో కృషిచేసి, అహోరాత్రులూ శ్రమించి, గ్రంథాలయ ఉద్యమం నిర్వహించి ఎన్నో గ్రంథాలయాలు స్థాపించారు.

‎

‎ప్రసిద్ధి చెందిన గ్రంథాలయాలలో కొన్ని అమెరికాలో 'కాంగ్రెస్ లైబ్రరీ', రోమ్ నగరంలో 'వాటికన్ లైబ్రరీ', 'బ్రిటీష్ లైబ్రరీ', మన దేశంలో చెన్నై లో 'కన్నెమరా' గ్రంథాలయం, తంజావూరులోని 'సరస్వతీ మహాలు', వేటపాలెంలోని 'సారస్వత నికేతనం', హైదరాబాద్ లో గల 'శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం', కడపలో సి.పి. బ్రౌన్ స్మారక గ్రంథాలయం, రాజమహేంద్రవరంలో 'గౌతమీ గ్రంథాలయం' ప్రసిద్ధ గ్రంథాలయాలు. గ్రంథాలయాల్లో చాలా రకాలున్నాయి. ప్రభుత్వ గ్రంథాలయాలు, స్వచ్ఛంద సంస్థల గ్రంథాలయాలు, పాఠశాలల గ్రంథాలయాలు.. ఇలా రకరకాలుగా ఉన్నాయి.

‎

‎గ్రంథాలయాల వల్ల చాలా ఉపయోగాలున్నాయి:

‎గ్రంథాలయాల్లోని పుస్తకాలు చదవడం వల్ల మనిషి విజ్ఞానవంతుడు కాగలడు.

‎మహా మేధావులు తరతరాలుగా సంపాదించిన అనుభవాలు, ఆలోచనలు గ్రంథాలలో భద్రపరచబడతాయి. కాబట్టి మనం వాటిని చదువుకోవచ్చు. ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

‎దేశాభ్యుదయానికి సమాజ వికాసానికి గ్రంథాలయాలు దోహద పడతాయి.

‎గ్రంథ పఠనమనే మంచి అలవాటు అలవడుతుంది.

‎వ్యక్తిత్వ వికాసానికి, దేశభక్తికి, ఉద్యోగ ప్రాప్తికి, కాలక్షేపానికి, మానసిక వినోదానికి అన్ని రకాలుగా ఈ గ్రంథాలయాలు ఉపయోగ పడతాయి.

‎నిరుద్యోగులకు, రిటైరైన ఉద్యోగులకు ఈ గ్రంథాలయాలు మంచి మిత్రులు. అందుకే ఒక ఆధునిక కవి ఇలా అన్నాడు: 'గ్రంథాలయాలు-విజ్ఞానాలయాలు-ఆధునిక దేవాలయాలు' అని.

‎ఈ గ్రంథాలయాల నిర్వహణ అనేది కత్తిమీద సాములాంటిది. అన్ని వర్గాల ప్రజల అవసరార్థం అన్ని పత్రికలుండాలి. ఈ ఆధునిక కాలంలో సాంకేతిక పరంగా అభివృద్ధి చెందిన మన ముంగిట్లోకి మన అందరి వినియోగంలోనికి వచ్చిన టెక్నాలజీ ద్వారా సాంకేతిక ఫలితాలను కూడా లైబ్రరీలో పాఠకులకు అందుబాటులో వుంచాలి. పలు దేశ విదేశాల, పలు రంగాల పుస్తకాలు పత్రికలను తెప్పించి పాఠకులు చదువుకుని భద్రపరిచేలా మంచి ఏర్పాటు ఉండాలి. ఏ ఒక్క వర్గానికి చెందిన పుస్తకాలకు ప్రాధాన్యత కాకుండా స్త్రీ, పురుష, ధనిక, పేద, చిన్న, పెద్ద, తేడా లేకుండా అందరికీ పనికి వచ్చే పత్రికలతో ఈ గ్రంథాలయాలు కళ కళలాడుతుండాలి. గ్రంథాలయాలు సరస్వతీ నిలయాలు కాబట్టి అన్ని రకాల గ్రంథాలు న్యాయం, వైద్యం, రాజకీయం, కళలు, సాహిత్యం, పురాణాలు, చారిత్రకాలు, శాస్త్రాలు, పరిశోధనలు, దేశభక్తి, నవలలు, నాటికలతో పాటు దిన, వార, పక్ష, మాస, త్రైమాసిక, సాంవత్సరిక పత్రికలతోపాటు అనేక రకాలైన గ్రంథాలుండాలి.

‎

‎ఇన్ని ఉపయోగాలుండి ఇంతటి ప్రాముఖ్యతను కలిగిన గ్రంథాలయాల నిర్వహణ చాలా కష్టంగా ఉంటోంది. నేడు సిబ్బంది కొరత, నిధుల లేమి, ప్రజల చైతన్యవంతమైన భాగస్వామ్య వ్యవస్థ కొరతగా ఉండటం, అధికారుల అజమాయిషీ లోపించడం వంటి వాటి వల్ల గ్రంథాలయాల నిర్వహణ బాగోలేదని పాఠకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ప్రతీ ఒక్కరూ ఈ గ్రంథాలయం నాది, నీది, మనది, అందరిది అనే భావంతో ముందుకు వచ్చి గ్రంథాలయ ఉద్యమాన్ని నిర్వహించాలి. స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ఇంకా ఉత్సాహవంతులైన కొందరు యువకులు కలిసి ముందుకొచ్చి నిర్వహణా బాధ్యత తీసుకోవాలి. అప్పుడే గ్రంథాలయాలను చాలా కాలం కాపాడుకోగలం.

‎

‎వ్యక్తిత్వ వికాసానికి, పెరుగుదలకు ఎంతో దోహదం చేస్తున్న గ్రంథాలయాలను కాపాడుకోవటం మనందరి బాధ్యత. గ్రంథాలయాలు విజ్ఞానాలయాలు, పఠన మందిరాలు, ఆధునిక దేవాలయాలు, విజ్ఞాన సాగరాలు, మనిషి వికాసానికి తోడ్పడే సారథులు, అజ్ఞానాన్ని తరిమికొట్టే గ్రంథాలు, ఉన్నత శిఖరాలనందించే సోపానాలు, వ్యక్తిత్వ వికాసాన్నిచ్చే పుస్తకాలు దేశాభివృద్ధిలో ప్రధాన పాత్రలు. ప్రపంచమనే మహా సాగరంలో దిక్సూచిలాంటి పుస్తకాలే మనిషికి మార్గదర్శకాలు, ఎందరో జీవితానుభవాలు, దివ్య సందేశాలు మనకు పాఠాలు. ఇవన్నీ కలగలిపితేనే గ్రంథాలయాలు విజ్ఞానాలయాలు! అటువంటి గ్రంథాలయాలను కాపాడటం-ప్రోత్సహించడం అందరి బాధ్యత.

‎

‎నవంబరు 14 వ తేదీ భారత దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా ప్రతీ సంవత్సరం ఈ నవంబరు 14 వ తేదీ నుంచి వారం రోజుల పాటు జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ, గ్రామ స్థాయిలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. విధి విధానాలు చెబుతుంటారు. ప్రభుత్వాలు ఈ గ్రంథాలయాల నిర్వహణ గురించి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలి. కార్యాచరణ ప్రణాళికను తయారుచేసి ఆర్థికంగా నిధులను విడుదల చేయాలి. మన వారసత్వ సంస్కృతి సాంప్రదాయాలు చారిత్రక ఆధ్యాత్మిక కళా వారసత్వాలు పలు అంశాలన్నిటినీ భావి తరాలకు అందించేది ఈ గ్రంథాలయాలే కదా!

‎వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిమీదా వుంది. కొన్ని సాహితీ సంస్థల వారు, రకరకాల క్లబ్ ల వారు,  భాషా సంఘాల వారు విజ్ఞానానికి నిలయమైన  గ్రంథాలయాలను పటిష్టపరిచే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని గ్రంథాలయాల అభివృద్ధికి తోడ్పాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా వున్నది..…