కూటమి విజయంతో రాష్ట్రానికి ఆదర్శం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ కూటమి విజయంతో రాష్ట్రానికి ఆదర్శం – ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ, మేజర్ న్యూస్; స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం–జనసేన–బీజేపీ కూటమి ఘన విజయం సాధించడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. గురువారం మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయంపై ఆమె కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు.
ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డుల్లో 24 వార్డులను కూటమి గెలుచుకుని చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులను కూడా కైవసం చేసుకుందని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన వారితో పాటు పోటీ చేసిన ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలియజేస్తూ, అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు.ఆరు మండలాల్లో మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, కూటమి 46 స్థానాలను గెలుచుకుందని, ఆరు జడ్పీటీసీ స్థానాలు టీడీపీ ఖాతాలో పడ్డాయని చెప్పారు. అన్ని మండలాల్లో ఎంపీపీ పదవులు కూడా కూటమికే దక్కడం కార్యకర్తల కృషికి నిదర్శనమన్నారు. ఆళ్లగడ్డ అంటే గొడవలు, ఉద్రిక్తతలకు మారుపేరనే అభిప్రాయాన్ని ఈ ఎన్నికల ద్వారా తాము పూర్తిగా మార్చేశామని అఖిలప్రియ పేర్కొన్నారు. ఎలాంటి ఘర్షణలు, అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ విషయంపై ఇతర జిల్లాల నాయకులు, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
ఎన్నికల్లో ఎలాంటి రాజీ రాజకీయాలు జరగలేదని స్పష్టం చేసిన ఆమె, ప్రజల మద్దతు, కూటమి బలమే విజయానికి కారణమని అన్నారు. జనసేనలో ఏర్పడిన కొన్ని విభేదాలను కూడా చర్చల ద్వారా పరిష్కరించి అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లామని తెలిపారు.గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై ప్రజల్లో విశ్వాసం పెరగడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా మరింత బాధ్యతతో పనిచేయాలని ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సూచించారు.
రాజకీయాల్లో మహిళలకు అధిక అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహిళా ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యుల సహకారంతో ప్రజలకు మరింత చేరువై సేవలందించాలని సూచించారు.ప్రతి నెల మండల పరిషత్, మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి ప్రజా సమస్యలను చర్చించి పరిష్కరించాలని, అభివృద్ధి పనులపై నిరంతరం దృష్టి సారించాలని ఆమె కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారానే భవిష్యత్తులో మరింత విశ్వాసం పొందగలమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఓపికగా విని, కూటమి ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలగకుండా ప్రతి నాయకుడు బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా