కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి! బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి..జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ సూచనలు
సిద్దిపేట, ; సిద్దిపేట జిల్లాలో ఖరీఫ్ 2026 సీజన్‌లో కరువు ప్రభావానికి గురైన రైతులకు రుణ ఉపశమన చర్యలు అందించడంలో బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. లక్ష్మీకిరణ్ సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, భారతీయ రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా అర్హులైన రైతులకు రుణ ఉపశమన ప్రయోజనాలు కల్పించాలని ఆదేశించారు.గురువారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని కరువు ప్రభావిత ప్రాంతాల రైతులకు అందించాల్సిన రుణ ఉపశమన చర్యలు, బ్యాంకుల ద్వారా కల్పించాల్సిన ఆర్థిక సహకారంపై సమీక్షించారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల ప్రాంతీయ అధికారులు, జిల్లా సమన్వయకర్తలు, బ్యాంకు శాఖల ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
8 మండలాల్లో కరువు ప్రభావం.. ప్రత్యేక చర్యలు
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 03, తేదీ 24-10-2026 ప్రకారం సిద్దిపేట జిల్లాలోని 8 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించినట్లు సమావేశంలో వివరించారు. వీటిలో ఒక మండలం తీవ్ర కరువు ప్రభావిత మండలంగా, మరో ఏడు మండలాలను మధ్యస్థ కరువు ప్రభావిత మండలాలుగా గుర్తించారు.కరువు ప్రభావిత రైతులకు పంట రుణాల పునర్వ్యవస్థీకరణ, రుణ చెల్లింపులపై తాత్కాలిక వాయిదా, రుణాల చెల్లింపు గడువు పొడిగింపు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణ సదుపాయాలు, అవసరాన్ని బట్టి అదనపు రుణాల మంజూరు వంటి అంశాలపై బ్యాంకర్లకు వివరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కరువు పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల పట్ల బ్యాంకులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. అర్హులైన రైతులను గుర్తించి భారతీయ రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాలు, బ్యాంకుల నిబంధనల ప్రకారం రుణ ఉపశమన చర్యలు చేపట్టాలన్నారు.వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకం, కోళ్ల పరిశ్రమ, చేపల పెంపకం వంటి అనుబంధ రంగాలపై ఆధారపడిన అర్హులైన లబ్ధిదారులకు కూడా అవసరమైన రుణ సహకారం అందించాలని కోరారు. ఇప్పటికే ఉన్న రుణాలను పునర్వ్యవస్థీకరించడంతో పాటు రైతులు తిరిగి వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగించేందుకు అర్హత, ఆర్థిక సాధ్యత ఆధారంగా అదనపు రుణాలు మంజూరు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు కరువు ప్రభావిత రైతుల వివరాలను బ్యాంకులకు అందించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
రూ.5,507.38 కోట్ల రుణాల మంజూరు.. 46.56 శాతం పురోగతి
జిల్లాలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా వార్షిక రుణ ప్రణాళిక అమలులో బ్యాంకులు ఇప్పటివరకు రూ.5,507.38 కోట్ల రుణాలను మంజూరు చేసి 46.56 శాతం పురోగతి సాధించాయి.జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశంలో బ్యాంకుల వారీగా, రంగాల వారీగా రుణాల మంజూరు పురోగతిని సమీక్షించారు.
రంగాల వారీగా రుణాల వివరాలు:
- ప్రాధాన్యతా రంగం: రూ.3,905.08 కోట్ల రుణాల మంజూరు, 40.36 శాతం పురోగతి.
- ప్రాధాన్యతేతర రంగం: రూ.1,602.30 కోట్ల రుణాల మంజూరు, 74.37 శాతం పురోగతి.మొత్తం జిల్లా రుణ ప్రణాళిక: రూ.5,507.38 కోట్ల రుణాల మంజూరు, 46.56 శాతం పురోగతి.
వ్యవసాయం, మహిళా సంఘాలు, యువతకు రుణాలు పెంచాలి..
జిల్లాలో బ్యాంకుల పనితీరును సమీక్షించిన అదనపు కలెక్టర్ వ్యవసాయం, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, స్వయం సహాయక మహిళా సంఘాలు, విద్య, గృహ నిర్మాణం తదితర ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరులో మరింత వేగం పెంచాలని సూచించారు.ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందించడంతో పాటు రైతులు, మహిళా సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలు, చిన్న వ్యాపారులకు బ్యాంకులు మరింత సహకారం అందించాలని కోరారు. నిర్దేశించిన వార్షిక రుణ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించేందుకు అన్ని బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.కరువు ప్రభావిత రైతులకు రుణ ఉపశమన ప్రయోజనాలు సకాలంలో అందేలా బ్యాంకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.