భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం
సిద్దిపేట, అర్బన్ : ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిష్టపురం లక్ష్మణ్ ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పరిరక్షించడంతో పాటు కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిద్దిపేట అసిస్టెంట్ కార్మిక అధికారి జ్యోతికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కిష్టపురం లక్ష్మణ్ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం కోసం వినియోగించాల్సిన కోట్లాది రూపాయలను ఐటీఐ కేంద్రాల నిర్మాణం, రక్త పరీక్షల పేరుతో సీఎస్సీ హెల్త్ కేర్ సెంటర్‌కు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. సహజ మరణం, ప్రమాద మరణాల క్లెయిములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జులై 2026తో ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం ముగిసినప్పటికీ, డెత్ క్లెయిములను కార్మిక శాఖ స్వీకరించకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఆధార్ నవీకరణ, పేర్ల సవరణ, రెన్యువల్ అధికారాలను రాష్ట్ర బోర్డు వద్దే ఉంచి స్థానిక అసిస్టెంట్ కార్మిక అధికారులకు అధికారాలు లేకుండా చేయడంతో కార్మికులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. నెలల తరబడి క్లెయిములు పెండింగ్‌లో ఉండటంతో పాటు మీ-సేవ కేంద్రాల వద్ద దళారీ వ్యవస్థ పెరిగి నిజమైన కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఖాళీగా ఉన్న ఏఎల్ఏ, డీసీఎల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కార్మిక అడ్డాల వద్ద షెల్టర్లు నిర్మించాలని, భవన నిర్మాణ కార్మికులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు దాటిన కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, సీఎస్సీ హెల్త్ టెస్టుల విధానాన్ని రద్దు చేయాలని కోరారు. సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న క్లెయిములను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర సమితి సభ్యుడు అందే అశోక్, జిల్లా అధ్యక్షుడు బెక్కంటి సంపత్, జిల్లా నాయకులు బియ్య బాలరాజు, వలబోజు నరసింహాచారి, గోమవరపు నర్సయ్య, నర్సిరెడ్డి మల్లేశం, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.