దివ్యాంగుల సమస్యలు పరిష్కరించకుంటే మరో ఉద్యమం
సూర్య - పెద్దపల్లి: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు దివ్యాంగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో మరో పెద్ద ఉద్యమం చేపడతామని వీహెచ్‌పీఎస్ జాతీయ కోర్ కమిటీ చైర్మన్ ఎల్.గోపాల్‌రావు, ఎంఆర్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం పెద్దపల్లి కమాన్ రోడ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
దివ్యాంగులకు రూ.6 వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల ఆసరా పింఛన్లు, కండరాల క్షీణత బాధితులకు రూ.15 వేల పింఛన్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 12 లక్షల పింఛన్ దరఖాస్తులను ఆమోదించాలని, ఒంటరి మహిళలు, వృద్ధుల పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియను కొనసాగించాలని కోరారు. మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యాన్ని దివ్యాంగులకు కూడా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.
ఖమ్మంలో జరిగిన జాతీయ సమావేశంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన చింతిరెడ్డి సంతోషరెడ్డికి జాతీయ కమిటీ సభ్యురాలిగా, మీర్జా అమీన్ బేగ్‌కు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, కన్నం స్వామికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవులు దక్కాయని తెలిపారు. మరో 15 రోజుల్లో జిల్లా కమిటీని విస్తరిస్తామని వెల్లడించారు.ఈ సమావేశంలో అంబాల నరేష్, ఐరెడ్డి నారాయణరెడ్డి, కన్నం స్వామి, అమీన్ బేగ్, నరిగే మల్లేశ్వరి, కల్వల స్వాతి తదితరులు పాల్గొన్నారు.