కేంద్ర సెన్సెస్ లో నో కాస్ట్, నో రిలీజియన్ కాలమ్స్ ఏర్పాటు చేయాలి
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : కేంద్ర జనగణలో కుల రహితులుగా జీవిస్తున్న వారిని అధికారికంగా గుర్తించేందుకు నో కాస్ట్, నో రిలీజియన్ అనే రెండు ప్రత్యేక కాలమ్స్ ను ఏర్పాటు చేయాలని కుల నిర్మూలన సంఘం నేతలు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు ఎండి వహీద్ .. అడ్వైజర్ సిఎల్ ఎన్ గాంధీ, ఉపాధ్యక్షుడు డాక్టర్ లయన్ ఈ సూర్యనారాయణ లతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో కులరహితులు 12 లక్షల మంది ఉన్నట్లుగా తేలిందన్నారు. వీరి సంఖ్య దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో ఉండే అవకాశం ఉన్నందున కేంద్రం కూడా వీరిని అధికారికంగా లెక్కించాలన్నారు. ప్రపంచంలో మూడవ అతిపెద్ద సమూహంగా ఏర్పడినట్లు చెప్పారు. అక్టోబర్ 30న విడుదల చేసిన గజిట్ నోటిఫికేషన్ లో నో క్యాస్ట్, నో రిలీజియన్ ప్రస్తావన లేదన్నారు. ఈ విషయమై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి ,కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి ,రిజిస్టార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ తదితరులకు వినతి పత్రాలు సమర్పించామన్నారు. తెలంగాణలో కూడా డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ కు ఇదే అంశంపై విజ్ఞప్తి చేశామన్నారు. తమ వినతులకు స్పందనగా రెండు కార్యాలయాల నుంచి సమాధానాలు వచ్చిన కులాల వారీగా నమోదు చేస్తామని ప్రకటించి కులరహితులు, మతరహితుల గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదన్నారు. ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని ఆచరించే హక్కు ఉన్నప్పటికీ, ఏ మతాన్ని ఆచరించకుండా ఉండే హక్కు కూడా ఉంటుందని కోర్టులు వివిధ తీర్పులతో స్పష్టం చేశాయన్నారు. కనుక కేంద్రం 2027 జనగణనలో ఈ రెండు ప్రత్యేక కాలంలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు రికార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు వై జ్యోతి, ప్రధాన కార్యదర్శి డిఎల్ కృష్ణచంద్, గ్రేస్ ఎనార్తి, సూర్యసుధ తదితరులు పాల్గొన్నారు.