రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స ప్రధానమంత్రి 'పీఎం రాహత్' పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి..
సంగారెడ్డి : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సకాలంలో మెరుగైన వైద్య చికిత్స అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి 'పీఎం రాహత్' పథకాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ సూచించారు.ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో.. జిల్లాలోని 24 ఎంపానెల్డ్ ఆసుపత్రులకు చెందిన వైద్యులు, సాంకేతిక సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ పథకం కింద రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.1,50,000 వరకు ఉచిత వైద్య చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీపంలోని ఎంపానెల్డ్ ఆసుపత్రులకు తరలించి, ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన వైద్య సేవలు అందించాలని ఎస్పీ సూచించారు.రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన చికిత్స అందించే విషయంలో ఆసుపత్రుల యాజమాన్యాలు, వైద్యులు, ఆరోగ్యశ్రీ సిబ్బంది ఇతర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ పథకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ప్రమాద బాధితుడికి ఉచిత వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి 'పీఎం రాహత్' పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, అర్హులైన ప్రతి రోడ్డు ప్రమాద బాధితుడికి ఉచిత వైద్య చికిత్స అందేలా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, సంబంధిత శాఖల అధికారులు, 24 ఎంపానెల్డ్ ఆసుపత్రులకు చెందిన వైద్యులు, టెక్నికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి చరణ్, ఎన్‌ఐసీ, ఆరోగ్యశ్రీ టీమ్ లీడర్ ప్రవీణ్‌లు ప్రధానమంత్రి పీఎం రాహత్ పథకానికి సంబంధించిన అప్లికేషన్ వినియోగం, పనితీరు, నమోదు ప్రక్రియ తదితర అంశాలపై వివరించారు.