మహిళలు, బాలికల భద్రతకు ‘షీ బాక్స్’లు ఫిర్యాదులు, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచాలి - జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్..
సంగారెడ్డి : మహిళలు, బాలికల భద్రతకు మరింత భరోసా కల్పించడంతో పాటు, వారు ఎదుర్కొంటున్న వేధింపులు, ఇతర సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకువచ్చేందుకు సంగారెడ్డి జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో షీ బాక్స్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలలు, మహిళా వసతి గృహాలు, బస్టాండ్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో మొత్తం 200 షీ బాక్స్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళలు, బాలికలు ఎలాంటి భయం, సంకోచం లేకుండా తమ ఫిర్యాదులను అందించేందుకు వీలుగా, సీసీ కెమెరాల నిఘా లేని, పురుషుల రాకపోకలు తక్కువగా ఉండే గోప్యత కలిగిన ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన షీ బాక్స్‌ల నిర్వహణ బాధ్యతను మహిళా పోలీసు అధికారికి అప్పగించనున్నట్లు తెలిపారు. ప్రతి శనివారం తప్పనిసరిగా షీ బాక్స్‌లను తెరిచి ఫిర్యాదులను సేకరించి, అదే రోజు సాయంత్రంలోగా షీ టీమ్స్ ఇన్‌చార్జి, పీసీఆర్ ఇన్‌స్పెక్టర్‌కు అందజేయాలని ఆదేశించారు.అందిన ప్రతి ఫిర్యాదును ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో రిజిస్టర్‌లో నమోదు చేసి, షీ టీమ్స్ ఎస్‌ఐ ద్వారా సంబంధిత షీ టీమ్స్ సిబ్బందికి కేటాయించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుపై వారం రోజుల్లోగా విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫిర్యాదుదారులు తమ సంప్రదింపు వివరాలు అందించినట్లయితే, వారి వివరాలను గోప్యంగా ఉంచుతూ వారిని సంప్రదించి, సమస్యకు పరిష్కారం చూపాలని సూచించారు.అదేవిధంగా పాఠశాలలు, కళాశాలల్లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, షీ బాక్స్‌ల వినియోగం, వాటి ద్వారా ఫిర్యాదు చేసే విధానంపై మహిళలు, బాలికలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ బాక్స్‌ల ద్వారా ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు, వెంటపడటం, సైబర్ వేధింపులు, గృహహింస తదితర సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని తెలియజేయాలని అన్నారు.షీ బాక్స్ ఫిర్యాదుల కోసం సంప్రదించాల్సిన వివరాలు:
ఫోన్: 8712656772
Instagram:@sheteamssangareddy షీ బాక్స్‌ల ఏర్పాటు ప్రధాన ఉద్దేశం ప్రతి మహిళ, బాలిక తన సమస్యను ఎలాంటి భయం లేకుండా పోలీసుల దృష్టికి తీసుకువచ్చి, న్యాయం పొందగలమనే నమ్మకాన్ని కల్పించడమేనని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.