శ్రీహరిపురంలో పల్లె నిద్ర కార్యక్రమం
స్థానిక ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించిన వంగర ఎస్సై షేక్ శంకర్
వంగర: నవంబర్ 12 మేజర్ న్యూస్
మండలంలోని శ్రీహరిపురం గ్రామంలో వంగర ఎస్సై షేక్ శంకర్ ఆధ్వర్యంలో గురువారం పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశమై స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఎన్నికల సమయంలో ప్రజలు ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎస్సై సూచించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు, ఘర్షణలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు