మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మృతి టీడీపీకి, రాజకీయ రంగానికి తీరని లోటు
రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో శత్రుచర్ల విజయరామరాజు అంత్యక్రియలు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
పార్వతీపురం/, నవంబర్ 12:మేజర్ న్యూస్ :
టిడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర రాజకీయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శత్రుచర్ల విజయరామరాజు ప్రజాసేవకు అంకితమైన నాయకుడిగా పేరు పొందారని మంత్రి కొనియాడారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రిగా వివిధ హోదాల్లో ప్రజలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలు, ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేసిన ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. విజయరామరాజు మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించడం ఆయన ప్రజా జీవితానికి, రాష్ట్రానికి అందించిన సేవలకు తగిన గౌరవమని మంత్రి పేర్కొన్నారు.ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో మనోధైర్యాన్ని భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు. శత్రుచర్ల విజయరామరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.