నాగుల చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో మహిళల పూజలు
పెరవలి మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలోని వివిధ గ్రామాల్లో నాగుల చవితి పర్వదిన వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి.కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 13వ తేదీ శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పుట్టల కోసం పొలంబాట పట్టారు పొలాల్లో ఉన్న పుట్టల వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లి నాగదేవతలను ఆరాధించారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకృతిలో భాగమైన పాములను నాగదేవతా స్వరూపంగా భావిస్తూ తరతరాలుగా నాగుల చవితి పండుగను భక్తితో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.పూర్వీకుల నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను కొనసాగిస్తూ మహిళలు తెల్లవారుజామునే ఇళ్లలో పూజలు ముగించుకుని పొలంగట్లపై, ఆలయాల సమీపంలో ఉన్న పాము పుట్టల వద్దకు చేరుకున్నారు.కొత్త వస్త్రాలు ధరించి, పూజా సామగ్రిని వెంట తీసుకువచ్చి నాగేంద్రుడికి భక్తిపూర్వకంగా పూజలు నిర్వహించారు.పాలు, నైవేద్యాలతో నాగేంద్రుడికి పుట్టల వద్ద పసుపు, కుంకుమలు సమర్పించి, పూలతో అలంకరించి, కొబ్బరికాయలు కొట్టి తమ భక్తిని చాటుకున్నారు.ఆవు పాలు, చిమ్ని, తేగలు, బుర్రగుంజు, చలిమిడి, పానకం తదితర సంప్రదాయ నైవేద్యాలను సమర్పించి నాగదేవతను పూజించారు.కొన్ని ప్రాంతాల్లో మహిళలు కోడిగుడ్లను కూడా నైవేద్యంగా సమర్పించడం కనిపించింది.పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమ కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సంతాన క్షేమం, కుటుంబ అభివృద్ధి కోసం నాగదేవతను ప్రార్థించారు.పెద్దలు పూజల్లో నిమగ్నమై ఉండగా పిల్లలు తమ ఆటపాటలతో సందడి చేశారు. దీంతో పెరవలి మండలంలోని పలు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.పల్లెల్లో కనిపించే ఈ దృశ్యాలు మన పూర్వీకుల ఆచార వ్యవహారాలను, గ్రామీణ జీవన విధానాన్ని మరోసారి గుర్తు చేశాయి.నాగుల చవితి రోజున నాగదేవతను భక్తిశ్రద్ధలతో పూజించి నైవేద్యాలు సమర్పిస్తే రాబోయే ఏడాది మొత్తం నాగదేవతల అనుగ్రహం తమ కుటుంబ సభ్యులపై ఉంటుందని, కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని ప్రజల్లో విశ్వాసం ఉంది.ఈ నమ్మకంతోనే మహిళలు ప్రతి సంవత్సరం నాగుల చవితి పర్వదినాన్ని ఎంతో నియమనిష్ఠలతో జరుపుకుంటున్నారు.కేవలం ఒక పండుగగానే కాకుండా తరతరాలుగా వస్తున్న ఆధ్యాత్మిక విశ్వాసాలకు, కుటుంబ సంప్రదాయాలకు ప్రతీకగా నాగుల చవితి నిలుస్తోంది.సంప్రదాయాల పరిరక్షణ మనందరి బాధ్యత మారుతున్న కాలానికి అనుగుణంగా జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ మన పూర్వీకులు అందించిన పండుగలు, ఆచార సంప్రదాయాలను నేటి తరం కూడా కొనసాగించడం విశేషం.