ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు
మండల వ్యవసాయ అధికారి తుమ్మనపల్లి జ్యోత్స్న వెల్లడి
మరో పది రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు
నిబంధన ప్రకారం తేమశాతం ఉండేలా చూసుకోవాలని సూచన
రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ముందస్తు ప్రణాళిక
గరుగుబిల్లి, నవంబర్ 12, మేజర్ న్యూస్:ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వరి పంట కోతలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరో పది రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని మండల వ్యవసాయ శాఖ అధికారి తుమ్మనపల్లి జ్యోత్స్న పేర్కొన్నారు.మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడారు.మరో పది రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మండల రైతు సేవా కేంద్రాలకు చెందిన అగ్రికల్చర్ అసిస్టెంట్లకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి శిక్షణా కార్యక్రమమును నిర్వహించడం జరిగిందన్నారు. రైతులు పండిస్తున్న తమ పంటను దళారులకు విక్రయించి నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి తుమ్మనపల్లి జ్యోత్స్న పిలుపునిచ్చారు.వరి పంట కోతలు చేపట్టిన తదుపరి ధాన్యాన్ని కల్లాల్లో ఆరబెట్టి తేమను నియంత్రించాలన్నారు. ధాన్యంలో మట్టి బెడ్డలు,రాళ్లు మరియు ఇతర వ్యర్థాలు లేకుండా తూర్పారబట్టి శుభ్రం చేయాలన్నారు.నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావడం ద్వారా తూకం ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని వ్యవసాయ శాఖ అధికారి తుమ్మనపల్లి జ్యోత్స్న వెల్లడించారు.రైతులు ధాన్యం విక్రయించే సమయంలో తమ ఆధార్ కార్డు జిరాక్స్, పట్టాదారు పాసుపుస్తకం నకలు మరియు బ్యాంకు ఖాతా వివరాలను తప్పనిసరిగా తీసుకు రావలసి ఉందన్నారు.ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన మద్దతు ధర నగదును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని అగ్రికల్చర్ అధికారి తుమ్మనపల్లి జ్యోత్స్న స్పష్టం చేశారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా రైతు సేవా కేంద్రాలకు సంబంధించిన వ్యవసాయ శాఖ సిబ్బందికి తగు సూచనలు,సలహాలను అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమశాతం 17 శాతానికి మించకుండా ఆరబెట్టి తీసుకురావాలని మండల వ్యవసాయ శాఖ అధికారి తుమ్మనపల్లి జ్యోత్స్న పేర్కొన్నారు.