ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
రామచంద్రపురం, మేజర్ న్యూస్ :మానవ దేహంలో కళ్ళు అత్యంత ప్రధానమైనవని, చూపు మనిషికి దేవుడిచ్చిన అమూల్యమైన వరమని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి శేషారావు అన్నారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, కంటి ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని వారు సూచించారు. పట్టణంలోని ఐదో వార్డు రాజబాబు నగర్‌లో డాక్టర్ ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి, కపిలేశ్వరపురం వారి ఆధ్వర్యంలో, కొమ్మనాపల్లి సత్తిబాబు, మహాలక్ష్మి, గంపల రామకృష్ణల సహకారంతో ఉచిత కంటి మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసంశెట్టి సత్యం, మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి శేషారావు హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించి, వైద్య సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి చూపు సమస్యలు చిన్నవిగా ఉన్నప్పుడే గుర్తించి తగిన వైద్యం తీసుకుంటే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను నివారించుకోవచ్చన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
సమాజ సేవలో భాగంగా ప్రజలకు అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు ముందుకు వస్తున్న దాతలను, వైద్య బృందాన్ని వారు ప్రత్యేకంగా అభినందించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రజలు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శిబిరంలో సుమారు 50 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఐదో వార్డు కౌన్సిలర్ గొర్రెల గణపతి, కొమ్మనాపల్లి సత్తిబాబు, మహాలక్ష్మి, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బుంగా రాజు, ప్రజాసేన అధ్యక్షులు కాటే సుబ్రహ్మణ్యం, ఏలూరు ఏసుదాసు, దొమ్మలపాటి విజయలక్ష్మి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.