సొంత పార్టీ ఎంపీ కార్యక్రమానికి వెళ్తే సస్పెండ్ చేస్తారా? ఏకపక్ష సస్పెన్షన్‌ను వెంటనే రద్దు చేయాలి
సూర్య - పెద్దపల్లి: సొంత పార్టీ ఎంపీ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైనందుకు తమను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఏమిటని కొయ్యూరు గ్రామ ఉపసర్పంచ్ లకవత్ సవేందర్ ప్రశ్నించారు. గురువారం పెద్దపల్లి కమాన్ రోడ్ ప్రెస్‌క్లబ్‌లో మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖలీముద్దీన్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కొయ్యూరు ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి గ్రామ వార్డు సభ్యురాలు లక్ష్మి, ఆమె భర్త తిరుపతి ఆహ్వానం మేరకు హాజరయ్యామని తెలిపారు. అయితే అదే రోజు సాయంత్రం మండల అధ్యక్షుడు జంగిలి శ్రీనివాస్ తమను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. కనీసం సంజాయిషీ నోటీసు ఇవ్వకుండా, ఫిర్యాదు వివరాలు తెలియజేయకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు.ఈ విషయంపై గాంధీభవన్‌లో టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమారరావుకు వినతిపత్రం అందజేశామని తెలిపారు. వెంటనే సస్పెన్షన్‌ను రద్దు చేయకపోతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి భూమయ్య పాల్గొన్నారు.