BREAKING
శీతాకాలంలో సీతాఫలం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు! భారత జనగణన–2027 ఫేజ్-II ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ ప్రారంభం రౌడీషీటర్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్. గూడ్స్ వాహనాల యజమానులు సమ్మె సైకిల్ పై 12 జ్యోతిర్లింగాల యాత్ర! ధర్మవరంలో తుఫాను బాధితులకు అండగా ప్రభుత్వం! సరదా ఈత విగతజీవులుగా మారిన విద్యార్థులు! కోమీర సర్పంచ్ పోటీకి బిజెపికి కేటాయించాలి సెలవుల్లో ఉన్న సర్వీస్ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం పంచాయతీకి తెలియజేయాలి భర్త మరణంతో కష్టాల్లో ఉన్న కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం మేయర్ శ్రావణికి బుద్ధ నాగ జగదీష్ అభినందనలు. బంగారం చోరీ కేసులో నిందితుడి అరెస్టు. ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతి ప్రవేశాలు గ్రంథాలయ వారోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ కృత్రిమ మేధ పరిణామాలపై ఐఎంఎఫ్ నిరంతర నిఘా

స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం..

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం..

                 నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత… సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా..
     ఎన్నికల విధుల్లో సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి..జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్..
                ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు – జిల్లా ఎస్పీ రాహుల్ మీనా..
అమలాపురం మేజర్ న్యూస్ :రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎన్నికల నిర్వహణ, సిబ్బంది కేటాయింపు, నామినేషన్ కేంద్రాలు, పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్ అధికారులు , ఇతర సిబ్బందికి స్టేజ్-1, స్టేజ్-2 శిక్షణ కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. శిక్షణకు హాజరుకాని సిబ్బందికి మరో అవకాశం కల్పించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. గ్రామ పంచాయతీలను క్లస్టర్ల వారీగా విభజించి నామినేషన్ కేంద్రాలను గుర్తించాలని, అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించడంతో పాటు ప్రతి దశను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయించాలని స్పష్టం చేశారు.
పోలింగ్ కేంద్రాల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన సిబ్బందిని కేటాయించాలని, ఎన్నికల నిర్వహణలో మానవ వనరుల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖ తదితర ప్రభుత్వ శాఖల సిబ్బంది సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. అన్ని మండలాల్లో బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసుకోవాలని, పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల పర్యవేక్షణకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని సూచించారు.
మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు
రాష్ట్రంలో తొలి విడతగా 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో మిగిలిన 23 మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించింది23 మున్సిపాలిటీలకు నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా, నవంబర్ 14 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. నవంబర్ 26న పోలింగ్, నవంబర్ 30న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. మేయర్, ఛైర్‌పర్సన్ ఎన్నికలు డిసెంబర్ 3న నిర్వహించనుండగా, అనివార్య కారణాలతో వాయిదా పడితే డిసెంబర్ 4న నిర్వహించనున్నారు.రు10 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్నపంచాయతీలకు ప్రత్యేక రిటర్నింగ్ అధికారులను నియమించనున్నారు.నామినేషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలు లేదా వీడియోగ్రఫీ ఏర్పాటు చేయాలని, సంబంధిత ఫుటేజీని 60 రోజుల పాటు లేదా ఎన్నికల పిటిషన్ల పరిష్కారం పూర్తయ్యే వరకు భద్రపరచాలని ఆదేశించారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు
గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. గత మున్సిపల్ ఎన్నికల్లో ఏడు జిల్లాలకు పరిమితమైన ఫిర్యాదులు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో 25 జిల్లాలకు విస్తరించిన నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులను బెదిరించడం, కిడ్నాప్ చేయడం, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం వంటి ఘటనలకు ఎక్కడా అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నామినేషన్ కేంద్రాలకు అభ్యర్థులు సురక్షితంగా చేరుకునేందుకు రూట్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు మొబైల్ పోలీసు పార్టీల సంఖ్యను పెంచాలని సూచించారు. రెండు వర్గాలు ఒకేసారి నామినేషన్ కేంద్రాల వద్దకు చేరుకుని ఘర్షణలకు దిగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం కాల్ సెంటర్‌కు ఫోన్ ద్వారా లేదా నేరుగా అందే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించేలా స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ ఫోర్సెస్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
ఎన్నికల సమయంలో పూర్తి అప్రమత్తత – జిల్లా ఎస్పీ రాహుల్ మీనా
జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ పూర్తి అప్రమత్తతతో పనిచేస్తుందన్నారు. నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు.ఏకగ్రీవ ఎన్నికలు స్వచ్ఛందంగానే జరగాలి
సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి జీవో వెలువడలేదని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏవైనా ఉత్తర్వులు వచ్చినప్పటికీ ఏకగ్రీవ ఎన్నికలు స్థానికుల స్వచ్ఛంద నిర్ణయం, స్వేచ్ఛాయుత ఎంపిక ద్వారానే జరగాలని, ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు, బలవంతపు చర్యలకు తావుండకూడదని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రక్రియలో అధికారులు అత్యంత విచక్షణతో, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ సూచించారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. డిసెంబర్ 4 నాటికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ రూపొందించింది.
ఈ సమావేశంలో డీఆర్వో వి. సుబ్బారావు  సీపీఓ  ఎం. మురళీకృష్ణ జిల్లా పంచాయతీ అధికారిని కే శాంతి కుమారి జిల్లా పరిపాలన అధికారి కె నాగలక్ష్మమ్మ వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు