బంగారం చోరీ కేసులో నిందితుడి అరెస్టు.
అనకాపల్లి, నవంబర్ 12, మేజర్ న్యూస్: స్థానిక అనకాపల్లి టౌన్ పోలీసులు ఇంటి దొంగతనం కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 45.190 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలతో, డీఎస్పీ పి.వి.వి.నరసింహారావు మార్గదర్శకత్వంలో, సీఐ జి.ప్రేమ్ కుమార్ పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం పట్టణంలోని గాంధీనగరానికి చెందిన మెల్లిపాక ప్రమీల ఇంట్లో ఆగస్టులో బీరువా తాళం పగులగొట్టి బంగారం చోరీ జరిగిందన్న ఫిర్యాదుతో 161/2026 కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారంతో ఎస్.ఐ. ఎ.వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి బుధవారం మధ్యాహ్నం సిటీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా లక్ష్మీదేవిపేట రైల్వే గేట్ రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పోణకర్లపల్లి నాగేంద్రకుమార్ (25), అంజయ్య కాలనీ, గాంధీనగరం, స్వస్థలం గుల్లిపల్లి, కె.కోటపాడుగా వివరించారు. నిందితుడి నుంచి నల్లపూసల తాడు 24.840 గ్రా, నెక్లెస్ 8.500 గ్రా, లాకెట్ తో చైన్ 6.420 గ్రా, బ్రాస్లెట్ 3.140 గ్రా, ఉంగరం 2.290 గ్రా.స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. కేసు ఛేదనలో కానిస్టేబుళ్లు ఎం.సముద్రం, ఆర్.పి.నాయుడు, టి.ఎస్.నాయుడు పాల్గొన్నారు.