రౌడీషీటర్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్.
అనకాపల్లి, నవంబర్ 12, మేజర్ న్యూస్: మద్యం దుకాణంలో దౌర్జన్యానికి పాల్పడిన రౌడీషీటర్ దాడి అరుణ్ కుమార్ ను అనకాపల్లి టౌన్ పోలీసులు అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్ కు తరలించారు. పోలీసులు అందించిన వివరణ ప్రకారం నిందితుడు మద్యం దుకాణానికి వెళ్లి డబ్బులు చెల్లించకుండా బాటిల్ ఇవ్వాలని కోరాడు. దుకాణదారుడు డబ్బులు అడగడంతో తనను తాను రౌడీషీటర్ గా పరిచయం చేసుకుని దురుసుగా ప్రవర్తించాడు. అనంతరం దుకాణంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి డబ్బులు చెల్లించకుండా బాటిల్ తీసుకొని, వెంట తెచ్చిన కత్తితో దుకాణదారుడిపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశాడు. ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా టౌన్ పోలీసులు హెచ్చరించారు.