వినబడని ప్రజల దాహం కేకలు...!
నరసన్నపేట నవంబర్ 21 మేజర్ న్యూస్ : నరసన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు కాలనీల్లో గత నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందిరానగర్, హట్కో కాలనీ, వంశధార కాలనీ, గాంధీనగర్ నాలుగో వీధి, తసారు వీధి, పురుషోత్తం నగర్ కాలనీ, శివనగర్ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు.
కనీస అవసరమైన తాగునీటిని కూడా సకాలంలో అందించడంలో మేజర్ పంచాయతీ అధికారులు, వాటర్ సప్లై విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో తరచూ తాగునీటి సమస్యలు తలెత్తుతున్నప్పటికీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు.
నీటి సరఫరా నిలిచిపోయినప్పుడు కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వడం లేదని, సరఫరా ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయంపై స్పష్టత ఉండటం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు నాలుగు రోజులైనా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు నిత్యావసరమైన తాగునీటి సరఫరాలో ఇంతటి నిర్లక్ష్యం గతంలో ఎన్నడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా మేజర్ పంచాయతీ అధికారులు స్పందించి వెంటనే తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
కాగా, తాగునీటి సరఫరా నిలిచిపోవడానికి గల కారణాలు, పునరుద్ధరణ చర్యలపై అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి సమాచారం అందుబాటులోకి రాలేదు.