పాత వెల్లంటిలో సీపీఎం సర్పంచ్ అభ్యర్థిగా పల్లవరపు చెంచయ్య నామినేషన్
నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ : నెల్లూరు రూరల్ మండలంలోని పాత వెల్లంటి గ్రామంలో సీపీఎం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పల్లవరపు చెంచయ్య శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. సీపీఎం నెల్లూరు రూరల్ మండల కార్యదర్శి పుడిపర్తి జనార్దన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో నామినేషన్ ప్రక్రియ నిర్వహించారు.ఈ సందర్భంగా పుడిపర్తి జనార్దన్ మాట్లాడుతూ.. నెల్లూరు రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో సీపీఎం బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా సౌత్ మోపూరు, ములుముడి, కొమ్మరపూడి, కాకుపల్లి, మాదరాజగూడూరు గ్రామాల్లో సీపీఎం మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా సీపీఎం అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తున్నారని తెలిపారు. ప్రజల మద్దతుతో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు వనం రామచంద్రయ్య, పల్లవరపు సుబ్రహ్మణ్యం, వనం రాగయ్య తదితరులు పాల్గొన్నారు.