ధర్మో రక్షతి రక్షితః (ఆథ్యాత్మిక వ్యాసం)
ధర్మో రక్షతి రక్షితః
(ఆథ్యాత్మిక వ్యాసం)
రచన ::--అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు.
సెల్ ::-- 8247433432
"ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షితః
తస్మాత్ ధర్మో న హంతవ్యో, మానో ధర్మోహతోవధీత్" అని మనుస్మృతిలో చెప్పబడింది.
దీని ప్రకారం ధర్మాన్ని బాధిస్తే అది తిరిగి మనలనే బాధిస్తుంది. ధర్మ రక్షణ చేస్తే అది మనలను రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని నాశనం చేయకూడదని దీని అర్థం. అంటే "చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపినవాణ్ణి చంపుతుంది. రక్షింపబడిన ధర్మం అ ధర్మాన్ని రక్షించినవారిని రక్షిస్తుంది కనుక, ధర్మం చేత మనం ఎప్పుడూ చంపబడకుండా శుద్ధిగా మనం ఆ ధర్మాన్ని సదా రక్షించాలి" అని తెలుసుకోవాలి. మనమందరం ఒక విషయాన్ని గమనించాలి.
"ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగేయుగే" అని భగవంతుడే స్వయంగా చెప్పాడు కదా! చెప్పినట్లుగానే యుగయుగాలో ఈ జగాన పలు అవతారాలెత్తి ధర్మాన్ని స్థాపించడం కోసం ఎందరో దుష్టులను శిక్షించినట్లుగా, శిష్టులను రక్షించినట్లుగా వేదాలు, పురాణాలు చెబుతున్నాయి కదా!.
రామాయణం ఆధారంగా ధర్మం గూర్చి ప్రస్థావించుకుందాం. ధర్మాచరణ గూర్చి కొంత తెలుసుకుందాం. హిందువుల ఆరాధ్య ప్రామాణిక ఇతిహాసమైన రామాయణంలోని కథా నాయకుడు అయిన రాముని గురించి "రామో విగ్రహవాన్ ధర్మ: " అని చెప్పారు కదా మహర్షి వాల్మీకి. అంటే ధర్మమనేది ఒక రూపం దాలిస్తే ఆ రూపమే శ్రీరాముడు.అంతే కాకుండా ధర్మమార్గంలో ఎలా రాజ్యాన్ని పరిపాలించాలో చెప్పాడు. చెప్పిన విధంగా చేసి చూపాడు రాముడు. మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా చేసి చూపాడు రాముడు. మనసులో వున్నట్లుగా ఆలోచన, ఆలోచించినట్లుగానే చెప్పే మాట, మాటల్లో చెప్పినట్లుగా పని చేసి చూపించిన గొప్ప ధర్మాత్ముడు శ్రీ రాముడు. ఆయన ఏ సమయంలోనూ తన ధర్మాన్ని అతిక్రమించలేదు. ఆయన చెప్పాడు. చెప్పిన దానినే అనుసరించాడు. ఇతరులను అనుసరింపచేసాడు. అందుకనే ఆయన మహానుభావుడు లోకోత్తరనాయకుడు అయినాడు.
ఒక సమయంలో తండ్రి దశరథుని ఆనతి ప్రకారం పదునాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి నారబట్టలు కట్టుకొని అడవులకు వెళ్ళాడు. కొద్ది రోజులకు తండ్రి చనిపోయాడు. ఆజ్ఞాపించిన తండ్రి దశరథుడు చనిపోయాడు ఆయన మాటలు పట్టించుకోనవసరం లేదు. కాబట్టి మీరు రాజ్యానికి వచ్చి రాజ్య పాలన చేయవచ్చు అని దశరథుని పురోహితుడు జాబాలి మొదలైన కొందరు రాముడిని ఒప్పించడానికి వాదించారు. నా తండ్రి చనిపోయినా బ్రతికున్నప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారం నేను వారికిచ్చిన మాట ప్రకారం నేను పదునాలుగు సంవత్సరాలు అరణ్య వాసం చేసి వస్తాను అదియే నేను ఆయనకు పుత్రునిగా నిర్వర్తించాల్సిన ధర్మం అని తండ్రికిచ్చిన మాట ప్రకారం రాజ్యానికి రానన్నాడు. అదీ వాక్ ధర్మమంటే. పలికిన మాట నిలబెట్టుకోవడమంటే. అందుకనే శ్రీ రాముడు సత్య వాక్పరిపాలకుడు, పితృవాక్యపరిపాలకుడు అయినాడు.
మరొక సందర్భంలో వాలి వధానంతరం సుగ్రీవుడి పట్టాభిషేక మహోత్సవ వేళ సుగ్రీవుడు రాముడుని కిష్కింధా రాజ్యానికి రమ్మని ప్రార్ధించాడు. తండ్రికిచ్చిన మాట ప్రకారం పద్నాలుగేండ్లు గ్రామాలు, నగరాలు, పట్నాలు, రాజ్యాలలో అడుగు పెట్టను అడవులలో వుంటానన్నాడు రాముడు. అదీ రాముడు పాటించిన ధర్మం. ఆ మహానీయుని గురించి ఇలా ఎన్నో ధర్మ విషయాలు చెప్పుకోవచ్చు.
ఇంక ధర్మ విషయం గురించి
"మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ | ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పణ్డితః" || ఇతరుల భార్యలను తల్లులుగా, ఇతరుల ధనాన్ని మట్టిబెడ్డలుగా ఎవరైతే భావిస్తారో అతడు జ్ఞాని
అని అర్థం.
ఇది ప్రతి మనిషి పాటించాల్సిన సామాజిక ప్రామాణిక ఆదర్శనీయమైన ధర్మం. దీనిని పాటించేవాళ్ళందరూ పుణ్యాత్ములు, మహానుభావులు. పాటించనివాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో పురాణాలలో ఎన్నో కథలు వున్నాయి.
ఈ ధర్మవాక్యం గురించి కూడా రామాయణంలో వున్నది. అసలు రామాయణ కథ మొత్తం నడిచినది ఈ ధర్మ వాక్యాన్ని అతిక్రమించడం వలనే అని చెప్పవచ్చు. పరమ శివ భక్తుడు అయిన రావణాసురుడు ఈ ధర్మాన్ని అతిక్రమించాడు. రాముని భార్య సీతాదేవిని బలవంతంగా ఎత్తుకెళ్ళిపోయాడు. పెళ్ళి చేసుకొమ్మని నిర్భందించాడు. కనుకనే అంతటి పరమ శివభక్తుడై వుండి కూడా పైగా అధిక బలవంతుడు గొప్పవాడు అయినప్పటికీ ఇతరుల భార్యను అపహరించాడనే ధర్మాన్ని అతిక్రమించాడు కనుకనే కుటుంబమే కాదు మొత్తం వంశంతో నాశనమైపోయాడు. ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు కాబట్టే రాముడు అతనిని సంహరించాడు.
అదే విధంగా ఈ వాక్యంలో చెప్పిన ఇంకో విషయం ఇతరుల సొమ్మును మట్టి బెడ్డలతో సమానంగా చూడమని వుంది కదా! మట్టి బిడ్డలుగా కాదు గడ్డి పరక కన్నా హీనంగా చూసింది కాబట్టే ఆ మహాతల్లి పతివ్రత అయినది. లోక పావని అయినది. పరమ పూజ్యురాలైనది సీతాదేవి.
రామాయణంలో సీతాదేవిని అపహరించిఎత్తుకెళ్ళి, తన వైభోగాన్ని, తన రాజ్యాన్ని చూపి తనను చేపట్టమని, పట్టపురాణి వైభోగాన్ని ఇస్తానని చెప్పాడు రావణాసురుడు. వాటినన్నిటిని చూసి, విని, వానినన్నిటినీ గడ్డి పరకతో సమానమన్నది. అంతే కాకుండా రావణుడితో ప్రత్యక్షంగా మాట్లాడకుండా గడ్డిపరకనడ్డుగా పెట్టి ఆ గడ్డి పరకతో మాట్లాడినది ఆ మహా సాధ్వి. ఆ మహాతల్లి సతీ ధర్మాన్ని, పాతివ్రత్య ధర్మాన్ని పాటించడమే కాకుండా ఇతరుల ద్రవ్యాన్ని గడ్డి పరక కన్నా హీనంగా భావించింది కాబట్టి ఆ మహా సాధ్వి పతివ్రతా శిరోమణి అయినది.
ఇలా రామాయణం లో అనేకానేక సంఘటనలు పరిశీలించినప్పుడు మనకు చాలా ధర్మ విషయాలు తెలుస్తాయి. చూడండి రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళే సమయంలో ఆమెను ముట్టుకోకుండా ఆమె పడిపోయిన భూభాగాన్ని ముక్కగా కోసి లంకకు తీసుకెళ్ళాడని వుంది కదా!
అదే విధంగా అశోక వనంలో సీతాదేవిని వుంచి పన్నెండు మాసాలు గడువిస్తున్నాను. అప్పటిలోగా మనసు మార్చుకొని నా వద్దకు చేరాలి ఒకవేళ మనసు మార్చుకోకపోతే నిన్ను మా వంటవాళ్ళు నా ఉదయ పలహారంగా సిద్దం చేస్తారు. అని చెబుతూ రాక్షస స్త్రీలను కాపాలా వుంచాడు కదా".
అదీ రాక్షసుడు అయివుండీ బలపరాక్రమవంతుడై
వుండీ కూడా పరాయి ఆడదానిమీద చేయి వేయకుండా ఏ మాత్రం బలవంతం చేయకుండా గడువిచ్చాడు కదా (పరాయి ఆడదాని అంగీకారం లేకుండా ఆమెను తాకితే మరణిస్తాడని రావణాసురుడికి శాపం వుంది) బహుశా అందువలననే సీతాదేవిని తాకకుండా జాగ్రత్త పడివుండొచ్చు. రాక్షసుడు అయివుండీ కూడా పరాయి ఆడదాని అంగీకారం లేకుండా అనే ధర్మాన్ని పాటించాడని చెప్పుకోవచ్చు.
ఇంకో చోట అరణ్యవాసం చేయడానికి వెళ్తున్న రామునితో తల్లి కౌసల్య దేవి వస్తానంటే భర్త ఎక్కడ వుంటే భార్య అక్కడే వుండాలి అని భార్య ధర్మాన్ని చక్కగా చెప్పటమే కాకుండా ఎండ కన్నెరుగని సుకుమారి అయిన తన భార్య సీతాదేవిని తనతో అడవులకు తీసుకెళ్ళాడు రాముడు. భార్యాభర్తల ఆదర్శ దాంపత్య ధర్మానికి ప్రతీకగా నిలిచాడు రాముడు.
అదే అరణ్యవాసంలో భరతుడు ససైన్యంగా రావడాన్ని చూసిన లక్ష్మణుడు భరతుడు గూర్చి పలికిన సందేహాస్పద మాటలకు నీకేమైనా రాజ్యకాంక్ష వుంటే చెప్పు భరతుడితో చెప్పి ఇప్పిస్తానని రాముడు అనగానే నాకు రాజ్యమే కాదు పద్నాలుగు భువనాలను పాలించే అధికారం వచ్చినా నాకు వద్దు మీ పాద సేవయే నాకు స్వర్గాధిపత్యం కన్నా అధికం అన్నాడు లక్ష్మణుడు.
అదే విధంగా మీరు తిరిగొచ్చే వరకూ నేను అయోధ్యలో అడుగుపెట్టను. నందిగ్రామంలో వుంటూ మీ పాదుకలను పూజిస్తూంటాను మీరు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం పూర్తి అయిన మరునాడు మీరు నాకు కనబడకపోతే ఆత్మాహుతి చేసుకుంటానంటాడు భరతుడు.
లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఇలా ఎవరికి వారే అన్నగారి పట్ల చూపించాల్సిన ధర్మాన్ని ఆయా సందర్భాలలో ప్రదర్శించారు.
ఇలా రామాయణంలో ప్రతీ సన్నివేశం ప్రతీ పాత్రా మనకు ఆదర్శనీయమైన ఆచరణీయమైన ధర్మాన్ని వివరిస్తునే వుంది.
ఈ విధంగా ధర్మాన్ని పాటించేవాళ్ళు ఈరోజుల్లో ఎక్కడైనా వున్నారా?
ఎవరు ఎట్లా పోతే నాకెందుకు నాకు పదవి వస్తే చాలనుకునేవారు. పదవుల కోసం తల్లి, తండ్రి, భార్యా, భర్తా, అన్నదమ్ములు, కడుపున పుట్టినవాళ్ళని కూడా లెక్క చేయకుండా తన ఆస్థికి, హోదాకి, పదవులకి, గౌరవాలకి అడొచ్చిన వాళ్ళని అడ్డు తొలగించుకొని గొప్పవాళ్ళైపోతున్నారు.
ధర్మం ఎక్కడ వుంది? న్యాయమంటే ఏమిటి?
నిజానికి వున్న శక్తి ఏమిటి? అనే విషయాలు తెలుసుకోకుండా పెద్దవాళ్ళు ప్రవర్తిస్తుంటే వాళ్ళని చూసి పిల్లలు ఎలా తయారవుతారో ఆలోచించండి. 'ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా'?
ఒకసారి ఆలోచించండి. ఈ రోజున డబ్బు (సంపాదన) యావలో పడిపోయి భార్య ఒకచోట, భర్త ఒకచోట, పిలల్లు వేరేచోట వుంటూ పలు ఇబ్బందులు పడ్తున్నారు కదా!.. తల్లి దండ్రులు ముసలి వాళ్ళైపోయారనే వంకతో తమ స్వేచ్ఛకు
అడ్డొస్తున్నారని తీసుకెళ్ళి ఎక్కడో వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులను, చైల్డ్ కేర్ సెంటర్స్ లో, రెసిడెన్షియల్ స్కూల్ తో దోపిడి చేస్తున్న హాస్టల్స్ నందు పిల్లలను చదువుల పేరుతో జాయిన్ చేస్తున్నారు కదా!
వాళ్ళకి, వీళ్ళకి ఎటువంటి సంబంధాలు వుంటాయి?. రక్తసంబంధాలు, "మానవ సంబంధాలు కన్నా
మనీ సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యత" ఇస్తున్న నేటి నవ తరం వారికి ధర్మాలు, నైతిక విలువలు అర్ధమవుతాయా?
ప్రతీ వారు తమ సొంత పనుల్లో బిజీ అయిపోతూ కుటుంబసభ్యులతో కన్నాతమ అవసరాలకు ఉపయోగపడే ఎలక్ట్రానిక్ వస్తువులు, మీడియాలతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్నారు. వాటిని రిమోట్
చేస్తూ ఉపయోగించుకుంటున్నామనుకొంటున్నారు కానీ వాటి చేతుల్లో బందీలైపోతూ విలువలు కోల్పోతున్నారు నేటి తరం వారు. అందుకనే ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాస్తవాలను గ్రహించాలి. సమయం సందర్భం కుదుర్చుకొని కుటుంబ సభ్యులతో గడపాలి. ధర్మానికి నిలయాలైన ఇతిహాసాలు పురాణాలు గురించి మాట్లాడుకోవాలి. వారంలో రెండు మూడు రోజులకైనా ఏదొక గుడిగోపురానికి అందరూ కలిసి వెళ్ళాలి. మన వంశం మన కుటుంబం లోని పూర్వీకులు పెద్దలు గురించి వివరించి చెప్పాలి. ధర్మాన్ని ఆచరించటానికి అనువైన వాటిని తెలుసుకోవాలి. ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే మనలను కాపాడుతుందని చెప్పాలి.
అందుకనే ""ధర్మో రక్షతి రక్షితః.."'".