ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
సికింద్రాబాద్ : భారత మాజీ ప్రధానమంత్రి, మొదటి మహిళ ఇందిరా గాంధీ జయంతి పురస్కరించుకుని, రాంగోపాల్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు త్రికాల మనోజ్ కుమార్ నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా త్రికాల మనోజ్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశ అభివృద్ధికి, దేశ సమగ్రతకు, ఐక్యతకు శ్రీమతి ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆమె విశేష కృషి చేశారని కొనియాడారు.
బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవానికి ప్రోత్సాహం, దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం వంటి కీలక నిర్ణయాలతో భారతదేశ చరిత్రలో ఆమె చెరగని ముద్ర వేశారని గుర్తుచేశారు. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆమె చేసిన కృషి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఆమె చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు