సిద్ధిపేట.. ఇక కాంగ్రెస్ అడ్డా..
సిద్దిపేట: 'ప్రగతిబాట' కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట అభివృద్ధికి రూ.500 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సిద్దిపేటలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీకి దివంగత కాంగ్రెస్ నేత మదన్‌మోహన్ పేరు పెట్టాలని అధికారులను ఆదేశించారు.
1983లోనే సిద్దిపేట గడ్డ కాంగ్రెస్ అడ్డా అని మదన్‌మోహన్ నిరూపించారని సీఎం గుర్తుచేశారు. గతంలో సింగిల్ విండో ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తొలిసారి రాజకీయ అవకాశం ఇచ్చింది కూడా మదన్‌మోహనేనని ఆయన పేర్కొన్నారు. మదన్‌మోహన్ పేరును చరిత్ర నుంచి కనుమరుగు చేయడానికి, సిద్దిపేటలో కాంగ్రెస్ ఉనికిని లేకుండా చేయడానికి కేసీఆర్, హరీష్ రావు కుట్రలు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
గత నాలుగు దశాబ్దాలుగా ఒకే కుటుంబానికి చెందిన వారే సిద్దిపేటను ఏలుతున్నారని విమర్శించిన ముఖ్యమంత్రి, రాబోయే ఎన్నికల్లో సిద్దిపేటలో గెలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. గెలిచే సత్తా ఉన్న నాయకుడి పేరును సూచిస్తే టికెట్ ఇప్పించే బాధ్యత తనదని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. 2023 డిసెంబర్ 7న ప్రజాపాలనకు శ్రీకారం చుట్టామని, 2029లో రెండోసారి రాష్ట్రంలో 'ఇందిరమ్మ రాజ్యాన్ని' తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే గజ్వేల్ గడ్డపై కూడా అడుగుపెట్టి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.