అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టొద్దు.. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ
హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) రెండు తెలుగు రాష్ట్రాలకు కీలక లేఖ రాసింది. కేంద్ర జల సంఘం (CWC), అపెక్స్ కౌన్సిల్ మరియు బోర్డు అనుమతులు లేకుండా ఎలాంటి కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టవద్దని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు బోర్డు స్పష్టం చేసింది.
కేవలం ప్రాజెక్టులు నిర్మించుకున్నంత మాత్రాన నదీ జలాలపై అదనపు హక్కులు లేదా అధికారాలు లభించవని కృష్ణా బోర్డు తన లేఖలో తేల్చి చెప్పింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం నిబంధనలకు లోబడి మాత్రమే ముందుకు వెళ్లాలని, అనుమతులు లేని ప్రాజెక్టుల పనులను తక్షణమే నిలిపివేయాలని బోర్డు సూచించింది.