మెలియాపుట్టి ఎంపీపీగా బైరసింగి దినకర్.. వైస్ ఎంపీపీగా సలాన రోహిణి ఏకగ్రీవ ఎన్నిక
మెలియాపుట్టి.నవంబర్ 19 .మేజర్ న్యూస్.మెలియాపుట్టి మండలంలోని గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాటు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మార్గదర్శకత్వంలో ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో సమష్టిగా కృషి చేస్తామని నూతన ఎంపీపీ బైరసింగి దినకర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రజల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మెలియాపుట్టి మండల పరిషత్ అధ్యక్షుడిగా బైరసింగి దినకర్, ఉపాధ్యక్షురాలిగా సలాన రోహిణి గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి సీహెచ్ నరసింహులు ఆధ్వర్యంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికతోపాటు ఎంపీటీసీల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ పదవికి బైరసింగి దినకర్ పేరును ప్రతిపాదించగా, సమావేశానికి హాజరైన ఎంపీటీసీలంతా చేతులెత్తి మద్దతు తెలిపారు. వైస్ ఎంపీపీ పదవికి సలాన రోహిణి పేరును ప్రతిపాదించడంతో సభ్యులందరూ ఆమెకు మద్దతు ప్రకటించారు. దీంతో ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
అనంతరం నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీపీ దినకర్ మాట్లాడుతూ, మండలంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందేలా ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడతామని, ప్రజాప్రతినిధులందరినీ కలుపుకొని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సహకారంతో మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు.
కార్యక్రమంలో కోసమాల పీఏసీఎస్ అధ్యక్షుడు సలాన మోహనరావు, ఎంపీడీవో పి.నరసింహ ప్రసాద్, తహసీల్దార్ రాము, ఎస్సై మహమ్మద్ అమీర్ అలీ, పోలీసు సిబ్బంది, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొని నూతన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు.