జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
సూర్య, నంద్యాల బ్యూరో: నంద్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా గురువారం రాత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో సమావేశ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, సభ్యుల సౌకర్యార్థం చేపట్టాల్సిన వసతులు, సమావేశ ప్రాంగణంలో చేయాల్సిన ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. చైర్మన్ ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వ నిబంధనలు, ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా పరిషత్ సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ నాగరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*