అధికారుల పర్యవేక్షణ ఏదీ? గోడలపై ప్రకటనల జోరు!
కట్టంగూర్ మేజర్ న్యూస్
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ప్రైవేట్ వ్యాపార ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ ఆస్తులు వ్యాపార ప్రచారానికి వేదికలుగా మారుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు, ప్రజారోగ్యం, పశువైద్య సేవలపై అవగాహన కల్పించాల్సిన గోడలపై ప్రైవేట్ ప్రకటనలకు చోటు కల్పించడం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందా? లేక అనుమతుల పేరుతో ఇతర వ్యవహారాలు సాగుతున్నాయా? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ కార్యాలయాల గోడలు ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని అందించేందుకు ప్రధాన వేదికలుగా ఉండాలి. ఖాళీగా ఉన్న గోడలపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పశువైద్య సేవలు, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, ఇతర ప్రజా అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రదర్శిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. కానీ ఇందుకు భిన్నంగా కొన్ని ప్రభుత్వ కార్యాలయాల గోడలు ప్రైవేట్ వ్యాపార ప్రకటనలతో నిండిపోతుండటం చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థల ప్రచారానికి వినియోగించేందుకు ఎవరు అనుమతులు ఇచ్చారు? అలా అనుమతులు ఇచ్చే అధికారం సంబంధిత అధికారులకు ఉందా? ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి
ప్రభుత్వ ఆస్తులు ప్రజల సొత్తు.. ప్రైవేట్ ప్రచారాల కోసం కాదు! అనే విషయాన్ని అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఏర్పాటు చేసిన ప్రైవేట్ ప్రకటనలపై విచారణ చేపట్టాలి. వాటికి అనుమతులు ఇచ్చినవారి వివరాలను పరిశీలించి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ గోడలను ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించేలా ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.