అనకాపల్లి జడ్పీ పీఠం జనసేన కైవసం.. ఛైర్‌పర్సన్‌గా మోటూరు నాగమణి!
అనకాపల్లి ప్రతినిధి మేజర్ న్యూస్: అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పరవాడ జడ్పీటీసీ సభ్యురాలు నాగమణి వైపే అధిష్ఠానం మొగ్గు
వైస్ ఛైర్‌పర్సన్‌గా తెదేపా నుంచి పెంటకోట స్వాతి ని ఖరారు చేశారు.నేడు చేతులెత్తే పద్ధతిలో జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక నిర్వహించనున్నారు.
అనకాపల్లి జిల్లా ఆవిర్భావం తర్వాత తొలిసారిగా కొలువుదీరనున్న జిల్లా పరిషత్తు (జడ్పీ) పీఠం కోసం నెలకొన్న ఉత్కంఠకు దాదాపు తెరపడింది. జిల్లావ్యాప్తంగా కూటమి ఘన విజయం సాధించడంతో, పొత్తు ధర్మానికి అనుగుణంగా జడ్పీ ఛైర్‌పర్సన్ పదవిని జనసేన పార్టీకి కేటాయించారు. బీసీ మహిళకు రిజర్వ్ అయిన ఈ కీలక పదవికి పరవాడ జడ్పీటీసీ సభ్యురాలు మోటూరు నాగమణి పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది.
తుదివరకు పోటీ.. అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్:
జిల్లాలో ఉన్న మొత్తం 24 జడ్పీటీసీ స్థానాల్లో తెదేపా 17, జనసేన 5, భాజపా 2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. మెజారిటీ స్థానాలు కూటమి సొంతం కావడంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల కోసం ఆశావహుల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. జనసేన నుంచి గెలిచిన ఐదుగురు సభ్యుల్లో పరవాడకు చెందిన మోటూరు నాగమణి, రాంబిల్లి సభ్యురాలు సేనాపతి రత్నం చివరివరకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, అన్ని సమీకరణాలను పరిశీలించిన అధిష్ఠానం నాగమణి వైపే మొగ్గు చూపింది.
తెదేపా ఖాతాలో వైస్ ఛైర్‌పర్సన్ పదవి: అధ్యక్ష పదవి జనసేనకు దక్కడంతో, ఉపాధ్యక్ష (వైస్ ఛైర్‌పర్సన్) పదవిని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. ఈ పదవి కోసం మునగపాక జడ్పీటీసీ సభ్యురాలు పెంటకోట స్వాతి, చోడవరం జడ్పీటీసీ సభ్యుడు కనిశెట్టి సన్యాసిరావు మధ్య పోటీ నెలకొనగా, చివరకు అధిష్ఠానం పెంటకోట స్వాతి పేరును ఖరారు చేశారు.
నేడే ఎన్నిక ప్రక్రియ:
శుక్రవారం జరగనున్న జడ్పీ ప్రత్యేక సమావేశంలో చేతులెత్తే పద్ధతి ద్వారా ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించనున్నారు. అధిష్ఠానం నిర్ణయంతో కూటమి నేతలంతా ఏకతాటిపై నిలిచి ఈ ఎన్నిక ప్రక్రియను లాంఛనంగా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు.
రిపోర్టర్. రవికుమార్, అనకాపల్లి జిల్లా ప్రతినిధి: