డాక్టర్ కోట నీలిమకు ఓవైసీ బహిరంగ క్షమాపణ చెప్పాలి:
సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన అనుచిత వ్యాఖ్యలను సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఒక మహిళా నాయకురాలిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం రాజకీయాల్లో హుందాతనానికి విరుద్ధమని, ప్రజా జీవితంలో ఉన్న మహిళల గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడటం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డాక్టర్ కోట నీలిమపై అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రసూల్‌పుర చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలు విధానాలు, ప్రజా సమస్యల చుట్టూ ఉండాలే తప్ప వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకోవడం తగదని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మహిళా నాయకురాలిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఓవైసీ రాజకీయ సంస్కారాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించారు.
డాక్టర్ కోట నీలిమపై చేసిన వ్యాఖ్యలను అసదుద్దీన్ ఓవైసీ వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆమెకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. మహిళల గౌరవం, ఆత్మగౌరవం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.