BREAKING
అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందివ్వడమే ధ్యేయం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి హౌస్ అరెస్ట్ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి హౌస్ అరెస్ట్ ముండ్లమూరు ఎంపీపీగా దేవినేని రమ కోటేశ్వరరావు ఎన్నిక ‎వేప చెట్టు సెంటర్ (కథ) నేటి నుండి దేవనకొండ నూతన పాలక వర్గం చిట్టమూరు సర్పంచ్ అభ్యర్థిగా గణపర్తి సుశీలమ్మ నామినేషన్ దాఖలు సుశీలమ్మకు మద్దతుగా నామినేషన్ పత్రాలు అందజేసిన జెడ్పీటీసీ సభ్యురాలు పెళ్లూరు సౌజన్యరెడ్డి కంబదూర్ మండలం ఎంపీపీగా తిమ్మక్క, వైస్ఎం పీపీగా గొల్ల దేవేంద్ర ఎంపిక ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి.. ప్రజల మన్ననలు పొందాలి!* *నందిగాం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 14 మంది ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం* నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. బద్వేలు మండల ఎంపీపీగా మడితాటి అపూర్వ ఏకగ్రీవ ఎన్నిక, ప్రమాణ స్వీకారం ఘనంగా సీనియర్ రాజకీయ నాయకులు జాపాల సుధాకర్ జన్మదిన వేడుకలు శ్రీ శుక్రవారం దేవి జగదాంబ మాత వార్షికోత్సవలు - ఈ నెల 19 నుండి 21వరకు మూడు రోజుల పాటు జాతర వేడుకలు భూ అభ్యంతరాలపై తక్షణం చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ మూడో రోజు కూడా కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కలకలం! పెరుగుతున్న కేసులు, విద్యార్థినుల్లో ఆందోళన!

‎వేప చెట్టు సెంటర్ (కథ)

Select Suryaa Now
‎వేప చెట్టు సెంటర్ (కథ)

‎వేప చెట్టు సెంటర్ (కథ)

‎రచన ::-- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు..

‎సెల్ :: 8247433432

‎"సోదరులారా ఎలాగైనా సరే మనం వేప చెట్టును కాపాడుకోవాలి. మన ప్రాణాలు పోయినా సరే ఆ చెట్టు అలాగే ఉండాలి. ఈ వేప చెట్టు ను కాపాడుకోవటానికి ఉద్యమం చేయాల్సిందేనంటూ దుర్గరాజు చాలా ఆవేశంగా మాట్లాడుతుండగా "అవున్నిజమే నువ్వు చెప్పినట్లుగా మన ప్రాణాలు పోయినా సరే మాస్టారు పెంచి పోషించిన చెట్టు ను కాపాడుకుందా”మని పాషా అనగానే “ఎవరొడ్డిస్తారో చూద్దాం చెట్టు మీద చేయేసినోడి తల నేల మీద పడాల్సిందే" నంటూ ఇంకా ఆవేశంగా దావిద్ అనేసరికి "ఎవ్వరూ కంగారు పడొద్దు రేపు ఉదయం మిషన్ వస్తోందిట కదా అప్పుడు చూద్దామం"టూ పెద్దాయన జానకి రామయ్య గారు చెప్పిన మాటకు ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు.

‎“రేయ్ బావా అసలు ఈ వేప చెట్టేమిటి? మాస్టారు కు సంబంధం ఏమిటి?" అంటూ హైదరాబాద్ నుంచి వచ్చిన దుర్గరాజును కార్తీక్ అడిగేసరికి "రేయ్ కార్తిక్ నువ్వా చెట్టు ను చూసావా?"అని అడగ్గా "లేదురా బావా” అని కార్తీక్ చెప్పగానే "సరే పద ముందు ఆ చెట్టును చూడు" అంటూ ఆ వేపచెట్టు సెంటర్ కు తీసుకెళ్ళాడు.

‎ఆ చెట్టు నాలుగు రోడ్ల సెంటర్ లో వుంది చాలా పెద్దగా ఉంది. ఆటోలు, ఆర్.టి.సి బస్ లు అన్నీ అక్కడే ఆగుతున్నాయి. "వేపచెట్టు సెంటర్" అని పెద్ద అక్షరాలతో బోర్డు కూడా ఉంది. దాని చుట్టూ సిమెంట్ తో కట్టిన గట్టు, సిమెంట్ బెంచీలు చాలా బాగుంది. అది సాయం సంధ్యా సమయం కాబట్టి ఆ గట్టు మీద చాలా మంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు.

‎కొందరు పిల్లలు చెట్టు చుట్టూ చేరి ఆడుకుంటున్నారు. ప్రయాణికులు అక్కడికొచ్చి బస్ లు, ఆటోలు ఎక్కడం, దిగడం చేస్తున్నారు. ఆ చెట్టు కుడి వైపు బడి, ఎడమవైపు గోదావరి నది ఉన్నాయి. ఎప్పుడు మంచి రద్దీగా ఉంటుంది. "బావా ఎంత పేద్ద చెట్టో?” అంటూ చెట్టు చుట్టూ తిరిగొచ్చి “పావుగంట పట్టిందిరా "అంటూ చెట్టు గట్టు మీద కూర్చొని నీళ్ళు తాగుతూ “ఇప్పుడు చెప్పరా బావా! అసలీ చెట్టు కథ” అన్నాడు కార్తీక్. "నేను కాదురా బావా అదిగో ఆ పెద్దాయన జానకి రామయ్య గారు చెబుతారు విను" అంటూ పెద్దాయన ను చూపించాడు దుర్గరాజు."చూడండి ఈ వేపచెట్టు ఒడిలో, చెట్టు బడిలో నేను ఓనమాలు దిద్దాను. బ్రతుకుతెరువు కోసం నడత నేర్చుకున్నాను. ఈ చెట్టు బడిలో ఓనమాలు దిద్దినవారెందరో అనేకానేక ఉన్నత పదవులలో సమాజానికి సేవలు చేసారు. స్వాతంత్య్రం ఉద్యమం లో పాల్గొన్న శివరాజు గారు, వేంకట్రామయ్య గారు, ఈ ఊరిలో పుట్టి పెరిగిన వారే కాకుండా చుట్టుపక్కల వాళ్ళెందరో ఈ చెట్టు కింద బడిలో చదువుకొని గొప్పవాళ్ళయ్యారు.

‎

‎శివరాజు గారు, వేంకట్రామయ్య గారు "మహాత్మా గాంధీ" పిలుపుతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని విదేశీ వస్త్రాలను, వస్తువులను సేకరించి వాటిని అన్నింటినీ ఇదిగో ఈ చెట్టు వద్దే దహనం చేసారు. బ్రిటీష్ సైనికులకు ఎదురు తిరిగి భారతదేశం జెండా పట్టుకొని వందేమాతరమంటూ నినదిస్తూ ఈ చెట్టు చిటారు కొమ్మన మన దేశ జెండా ను ఎగురవేశారు. ఆ ఇద్దరు దేశ భక్తులు ముందు నడుస్తా ఉంటే, వందేమాతరమంటూ వందలాది దేశ భక్తులు గర్జిస్తూంటే తెల్లవారి గుండెల్లో ఫిరంగులు మ్రోగినాయి. అప్పుడు జరిగిన బ్రిటీష్ వారి కాల్పుల్లో అయిదుగురితో పాటు శివరాజు గారు కూడా చనిపోయారు. అప్పట్నుంచి ఈ చెట్టు కు ప్రాధాన్యత పెరిగింది.” అంటూ చెబ్తోన్న జానకి రామయ్య గారి మాటలకు అడ్డు తగులుతూ "అసలు చెట్టు ఎవరు పాతారు? ఇప్పుడు ఈ చెట్టు వయసెంత?" అంటూ కార్తీక్ అడిగాడు. “మంచి ప్రశ్న అడిగావయ్యా” అంటూ “ఈ చెట్టు ను శివరాజు గారి తాత లక్ష్మీ నరసింహం మాస్టారు గారు పాతారు" అని చెప్పగానే "అవునా మాస్టారు వేప చెట్టు నే ఎందుకు పాతారు?" అంటూ దుర్గరాజు అడిగాడు. “లక్ష్మీ నరసింహం మాస్టారు ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ అక్షరాలు చెప్పి ప్రయోజకులను చేసినారు. ఒకసారి అదేదో వైరస్ లాంటి మహమ్మారి అంటు రోగం వచ్చి ఊళ్ళో ప్రజలు చాలా ఇబ్బందులు పడసాగారు. ఇళ్ళల్లోంచి ఎవరూ బయటకు రాకుండా బయటి వాళ్ళెవరూ ఊళ్ళోకి రాకుండా రాత్రి పగలు కాపాలా కాసి ఇంచుమించుగా ఒకరితో ఒకరు సంబంధాలు లేకుండా ఊరిలోని ప్రాణాలను కాపాడుకునే ఆ ప్రయత్నంలో ఇద్దరు, ముగ్గురు చనిపోయారు. వైద్యం ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాని ఆ రోజుల్లో ప్రకృతి వైద్యం చేస్తూ ఎంతోమందిని బ్రతికించే లక్ష్మీ నరసింహం మాస్టారు. ఔషధ గుణాలు గల వేప మొక్కలను ఈ ప్రాంతంలో చుట్టుపక్కల అనేక గ్రామాల్లో కూడా నాటారు. వాటి నుంచి వచ్చే గాలి వలన, వేప చెట్టు యొక్క వివిధ రకాలైన ఔషధాల వలన పేరు తెలియని ఆ మహమ్మారి రోగం తగ్గి ప్రజలందరూ సుఖంగా ఆరోగ్యంగా ఉన్నారు. అప్పుడు పాతిన మొక్కలలో ఈ చెట్టు ఒకటి బ్రతికింది. ఈ చెట్టు కి సుమారు నూటాయాభై సంవత్సరాలుండొచ్చనుకుంటాను. ఆ రోజుల్లో ఆ మాస్టారు నాటిన మొక్క పెద్దదై వీధి ఐడై ఎన్నో సంఘటనలకు చారిత్రక సాక్ష్యం గా నిలిచింది. అటువంటి చెట్టు ను ఈనాడు రోడ్డు వెడల్పు చేయటానికి అట్టొచ్చిందంటూ తీసేస్తామంటున్నారు.”

‎అని జానకి రామయ్య గారు చెప్పగానే “ఏవండీ మీరు చెప్పినవన్నీ నిజాలేనా? సాక్ష్యాలు ఉన్నాయా?" అంటూ ఫోటోలు తీస్తూ ఒక వ్యక్తి అడిగేసరికి దుర్గరాజు చాలా కోపంగా అతని దగ్గరకు వెళ్ళి "ఆయన చెప్పిన విషయాలన్నీ నిజాలే. వాటికి సాక్ష్యాలు కావాలంటే వెళ్ళి ఆ లక్ష్మీ నరసింహం గారిని అడుగు” అనగానే “అదేమిటి అట్లాగంటారు?. ఆయన చెప్పిన మొత్తం విన్నాను. నేను టీ.వీ 6 రిపోర్టర్ ను. వాస్తవాలే ప్రచారం చేస్తామనే టీ.వీ 6 రిపోర్టర్ ను. నా పేరు వాస్తవ్. "అంటూ కార్డు తీసి చూపించాడు. "చూడండి వాస్తవ్ గారు ఈ పెద్దాయన చెప్పినవన్నీ చరిత్ర చెప్పే వాస్తవాలే. ఎలాగైనా ఈ చెట్టు ను కాపాడుకోవటానికి మేం నెల రోజుల నుండి ఉద్యమం చేస్తున్నాం. సర్వోదయ నాయకులు అయిన జానకి రామయ్య గారు దీనికి నాయకులు. గాంధీ సిద్ధాంతాలను అనుసరించే పెద్దలందరూ మాకు దారి చూపుతున్నారు. మీరు మీ మీడియా తరపున మాకు బలాన్నివ్వండి" అని దుర్గరాజు అనగానే “చూడండి మా మీడియా నుంచి పూర్తి సపోర్ట్ ఇస్తాం మీకు" అంటూ నెలరోజులుగా జరుగుతున్న ఉద్యమ వివరాలు ఫోటోలు నాయకులు పేర్లు అన్నీ రికార్డు చేసుకున్నాడు వాస్తవ్.

‎మర్నాడు వేప చెట్టు సెంటర్ ఉద్యమ కారులతో నిండిపోయింది. "రేయ్ ఇప్పుడు మొదలెడితే కానీ సాయంత్రానికి చెట్టు నరకడం పూర్తవదు తొందరగా మొదలెట్టండిరా" అంటూ కాంట్రాక్టర్ కోటేశ్వరరావు అనగానే "రండి చెట్టు మీద చేయి వేయండి చూద్దాం అంటూ, పుచ్చకాయ పగిలినట్టు పగిలిపోతాయి తలకాయలు" అంటూ దుర్గరాజు, దావీదు ఇంకా చాలామంది వేపచెట్టు చుట్టూ అడ్డంగా నిలబడ్డారు. "మర్యాదగా అడ్డు తొలగండి మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి లేదంటే మా సంగతి మీకు తెల్వదు"అని కోటేశ్వరరావు అనగానే "చూడండి కోటేశ్వరరావు గారు ఆ యువకులతో అనవసరంగా గొడవపెట్టుకోకండి. మర్యాదగా ఇక్కడినుంచి వెళ్ళిపోండి" అని జానకిరామయ్య గారు అన్నారు. "ఏం చేస్తారండి వీళ్ళు? ఇట్లాంటి బెదిరింపులు చాలా చూసాం ఒక్కసారి మా నాయకుడు ఫోన్ చేసారంటే వీళ్ళ అడ్డుతొలగించుకొని ఈ వేపచెట్టు ను నరికేస్తాం" అని కోటేశ్వరరావు అనగానే “రమ్మనండీ ఎవరో మీ నాయకుడుని ? ఆయన సంగతి తేలుస్తామం"టూ దుర్గరాజు అనేసరికి ఈ విషయాలన్నీ కవర్ చేస్తున్న వాస్తవ్ ‘" విప్లవాగ్ని అల్లూరి నడయాడిన సీమలో, దేశ మాత విముక్తి కోసం ప్రాణాలర్పించిన ఈ వీరభూమిలో తరాలకు సాక్ష్యం గా నిలిచిన వేప చెట్టు ను కాపాడుకోవడానికి గాంధీ మార్గంలో జరుగుతోన్న ఉద్యమం ఇది. ఆస్తుల కోసం, పొలాల కోసం, రాజ్యాల కోసం యుద్దాలు జరిగిన సంఘటనలు మనం ఇంతవరకూ చూసాం. కానీ ఇప్పుడు చరిత్ర లో మొదటి సారి ఒక చెట్టు కోసం యుద్ధం జరుగుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో? రాజకీయ అధికారం నెగ్గుతుందో? వారసత్వాన్ని తరాలకందించే గాంధీ మార్గంలో జరిగే అహింసా విధానం నిలబడుతుందో?” అంటూ వాస్తవ్ చెబుతున్నాడు. ఇంతలో అక్కడకు ఆ జిల్లా కలెక్టర్ వెంకటేష్ వచ్చారు. “చూడండి సార్ వీళ్ళందరూ ఈ చెట్టును కొట్టొద్దని, తీయొద్దని గొడవ చేస్తున్నార”ని కోటేశ్వరరావు చెప్పగానే కలెక్టర్ గారు "నేను వాళ్ళతో మాట్లాడతానం"టూ దుర్గరాజు, దావీదు, పాషా లను పిలిచారు. “రోడ్డు వెడల్పు చేసే పనిలో ఈ వేపచెట్టు ను తీసేయాల్సివస్తోంది. మీరంతా ఒప్పుకోవాలి" అని కలెక్టర్ అనగానే "మేం ఒప్పుకోం మా ప్రాణాలైనా ఇస్తాం కానీ ఈ వేపచెట్టు ను ఇక్కడినుంచి తీయడానికి కుదరదు" అని అందరూ గట్టిగా అరిచేసరికి "మర్యాదగా ఒప్పుకోండి మా పనులకు అడ్డు తొలగండి" అని కలెక్టర్ అనగానే “మీరే అడ్డు తొలగండి చెట్టు ను బ్రతకనివ్వండి" అని జానకి రామయ్య గారు గట్టిగా అరిచేసరికి మిగిలిన వాళ్ళందరూ ఆయనతో "అవును మీరే వెళ్ళిపోండి" అంటూ చెట్టు చుట్టూ కుర్చున్నారు.

‎కలెక్టర్ గారు ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ట్రాఫిక్ చాలా దూరం ఆగిపోయింది. జానకి రామయ్య గారి సూచనల మేరకు అక్కడ ఉన్న వారందరికీ వేపచెట్టు ఉత్పత్తులను ఇస్తున్నారు. ఏవో కరపత్రాలు పంచుతున్నారు. ఏం చేయాలో తోచని అయోమయ స్థితిలో కలెక్టర్ గారు, రాజకీయ నాయకుల అనుచరులు, పోలీసు సిబ్బంది అందరూ ఉండగా స్థానిక శాసనసభ్యుడైన వెంకటప్పయ్య వచ్చి "ఏందయ్యా సామీ అట్టా సూత్తాన్నావ్ వార్నింగ్ ఇచ్చి పైరింగ్ చేసేయండి " అని సీరియస్ గా అనేసరికి “ఏంటి సార్ ఫైరింగ్ చేసేది? వాళ్ళేమి దేశద్రోహులు కాదు, ఉగ్రవాదులు కాదు శాంతియుతంగా గాంధీ మార్గంలో తమ పూర్వీకుల వారసత్వాన్ని కాపాడుకోటానికి చేస్తున్న ఓ మహాయజ్ఞం అటువంటి వాళ్ళ మీద ఫైరింగ్ చేసే అధికారం ఎవరికీ లేదు.”

‎అని కలెక్టర్ గారు చెప్పగానే "ఏందయ్యా సామీ నువ్వనేది? ఈళ్ళందరి సంగతి మా వాళ్ళు చూసుకుంటారు కానీ నువ్వట్టా దూరంగా పోయి సూత్తా ఉండు. రేయ్ కోటేశరావా! మనోల్ని మిషన్ తెచ్చి చెట్టు నరికేయమను. రేయ్ బాబీజీ ఈ చెట్టు కాడినుంచి ఈళ్ళందరినీ లాగిపాడేయ్". అని వెంకటప్పయ్య గట్టిగా అరిచేసరికి వాస్తవ్ కెమెరా వెంకటప్పయ్య మీద జూమ్ చేస్తూ "అయ్యా వెంకటప్పయ్య గారు నమస్కారం మీరు మాట్లాడేదంతా ప్రజలు వింటున్నారు. చేసేదంతా చూస్తున్నారు. నేనో ప్రశ్న అడుగుతాను సూటిగా చెప్పండి మీరు ఇక్కడే పుట్టి పెరిగారా? ఎక్కడ్నుంచైనా వచ్చారా?"అని ప్రశ్నించేసరికి "నేనీడనే పుట్టి పెరిగా, మాతాత ముత్తాతలీడనే పుట్టి పెరిగారు. అయన్ని వుప్పుడెందుకంటా?" అని వెంకటప్పయ్య అడగ్గానే “మీ చిన్నతనంలోనే మీ తాత చనిపోయారు కదా ఆయన ఎలా చనిపోయారో మీకు తెలుసా?”అని వాస్తవ్ అడిగేసరికి "ఏమో అయ్యేమీ గురుతులేదు". అని వెంకటప్పయ్య చెప్పిన దానికి “ఈ వెంకటప్పయ్య గారి తాతకి అదొక రకమైన వైరస్ లాంటి జబ్బు వచ్చి చనిపోయారు ఈ వెంకటప్పయ్య క్కూడా అదే జబ్బు వస్తే ఈ వేపచెట్టు ఔషధం వలనే బతికారు" అని జానకి రామయ్య గారు చెప్పేసరికి "మీరు ఈ వేపచెట్టు ఔషధం వలన బ్రతికి ఇప్పుడు దానిని చంపేయమనడం న్యాయమా వెంకటప్పయ్య గారు?" అని వాస్తవ్ అనేసరికి "ఏమో ! అయ్యేమీ నాకు తెల్వదు. మన ఊరు బాగుకోసం నే కష్టపడి రోడ్డు సాంక్షన్ చేయిస్తే ఈ ఏపసెట్టు ను తీయద్దాంటారే? మనూరు బాగుపడటం మీకిష్టం లేదా?" అని వెంకటప్పయ్య అడిగేసరికి "మన ఊరు బాగుపడడం మాకందరికీ ఇష్టమే. తరాలనుంచి ఎందరికో ఆరోగ్యాన్నిచ్చే వేపచెట్టు తీయడం మాకిష్టం లేదు.” అని దుర్గరాజు చెప్పిన వెంటనే "మన ఊరికి ఈ వేపచెట్టు వలనే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఈ వేపచెట్టు ను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు అందువల్ల మన ఊరి పంచాయితీ కి ఆదాయం కూడా బాగా వస్తోందం”టు దావీదు చెప్పాడు. "మన దగ్గర లోని ఆర్టీసీ డిపో వారు కూడా మన ఊరు లో బస్ స్టాప్ కు వేపచెట్టు సెంటర్ అని పేరు ఏర్పాటు చేసి ఈ వేప చెట్టు సెంటర్ కు ఒక ప్రత్యేకతను కల్పించారు. ఇన్ని విశేషాలు ఉన్న ఈ వేపచెట్టు ను తీయటానికి వీల్లేదు.”

‎అని పాషా అనగానే "మర్యాదగా ఇక్కడినుంచి వెళ్ళిపోండి ఈ చెట్టు ను తీయాల్సిందే రేయ్ బాబీజీ ఈళ్ళని లాగి పాడేయ్ రేయ్ కోటేశరావా నువ్వు మిషనెక్కి చెట్టు నరికేయ్" అని వెంకటప్పయ్య అనగానే వాస్తవ్ కెమెరాను వెంకటప్పయ్య మీద జూమ్ చేస్తూ "అయ్యా వెంకటప్పయ్య గారూ ఇంతమంది ఇన్ని విధాలుగా చెబుతున్నా మీరు ఈ వేపచెట్టు ను ఎందుకు తీయాలనుకుంటున్నారు?" అని అడిగాడు "రోడ్ వెడల్పు చేస్తున్నాం అందుకే ఈ వేపచెట్టు ను తీసేయాలంటున్నా" అని వెంకటప్పయ్య అనగానే కలెక్టర్ గారు "మీరే తేల్చుకోండి చెట్టు కావాలో? రోడ్ వెడల్పు కావాలో?" అని మైక్ లో చెప్పగానే "వేపచెట్టు ను నలభై చెట్టు అంటారు. అంటే నలభై రకాలుగా మన ఆరోగ్యాన్ని కాపాడతుంది. ఎవరైతే పగటిపూట వేపచెట్టు "నీడలో విశ్రమిస్తారో వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారని చరకుడు చెప్పాడు. మన భారత దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఇంటి ఆరోగ్య దేవత గా వేపచెట్టు ను పూజిస్తారు. 200 ఏళ్ళు ఈ వేప చెట్టు బ్రతుకుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అటువంటి ఈ వేపచెట్టు కావాలనుకునే వారందరూ చెట్టు వద్దకు రండి రోడ్ వెడల్పు కావాలనుకునే వారందరూ వెంకటప్పయ్య గారి వైపు వెళ్ళండి" అని జానకి రామయ్య గారు గట్టిగా అరిచేసరికి ఓ పది మంది తప్ప మిగిలిన వాళ్ళందరూ వేపచెట్టు వైపు వెళ్ళిపోయారు. వెంటనే కలెక్టర్ గారు “చూడండి వెంకటప్పయ్య గారు మీరు తీసుకొచ్చిన మీ మనుషులే వేపచెట్టు కావాలంటూ వేపచెట్టు వద్దకు వచ్చారు. ఎక్కువ మంది వేపచెట్టు కావాలంటున్నారు కాబట్టి ఈ వేపచెట్టు ఇక్కడి నుంచి కొట్టడంలేదు. తీయడం లేదు. రోడ్ డిజైన్ మార్చే ఏర్పాట్లు చేయండి. అయ్యా జానకి రామయ్య గారు ఈ వేపచెట్టు తరాలనుంచి ఆరోగ్యాన్నందించే వారసత్వపు చిహ్నం గా ప్రకటిస్థూ ఈ వేపచెట్టు ను ఉమ్మడి ఆస్థిగా ప్రకటిస్తూ ఈ వేపచెట్టు ను కాపాడటానికి మీ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించేసి కలెక్టర్ గారు కారెక్కి వెళ్లిపోయారు. దుర్గరాజు, పాషా, దావీదు "జానకి రామయ్య మాస్టారు జిందాబాద్" అంటూ జేజేలు చెబుతుండగా వాస్తవ్ కెమెరా జూమ్ చేస్తూ “చూడండి ఆ ఉత్సాహం, ప్రజా ఉద్యమానికి అందిన విజయం, తరాల వారసత్వంగా ఆరోగ్య ప్రదాయిని గా నిలచిన ఈ వేపచెట్టు కథ భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది" అని చెబుతుండగా "ఇది నా ఒక్కడి విజయం కాదు. మనందరం సాముహికంగా సాధించిన విజయం. చెట్లు ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడడమే కాకుండా రకరకాల వైరస్ లు నుండి కూడా కాపాడుతాయి. పర్యావరణాన్ని కాపాడటానికి చెట్లను పెంచుదామని చెబుతుండగా"... ఆ సాయం సంధ్య వేళ గోదావరి నీళ్ళమీద నుంచి వచ్చే పిల్లగాలులను మౌనంగా ఆస్వాదిస్తూ వేపచెట్టు అంతవరకూ తనకోసం జరిగిన ఉద్యమంలో అలసిన వారందరికీ ఉపశమనాన్ని కలిగిస్తూ మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఇతరులకు చేతనైనంత సాయం చేయండనే సందేశాన్ని మౌనయోగిలా అందిస్తోంది వేపచెట్టు. అదిరా కార్తీక్ బావా మా వేపచెట్టు కథ, ఈ వేపచెట్టు సెంటర్ ప్రత్యేకత అని దుర్గరాజు చెబుతుండగా వేపచెట్టు వైపు చూసిన కార్తీక కు అక్కడ పసుపు కుంకుమ లతో అలరారుతున్న పండుముత్తైదువలా వేపచెట్టు పక్కనే సాధుపుంగవుడిలా చిరునవ్వులు చిందించే జానకి రామయ్య గారు కనిపించగానే హేట్సాఫ్ చెబుతూ ఆ వేపచెట్టు సెంటర్ ను తన సెల్ ఫోన్ లో ఫోటో తీసుకొని హైదరాబాద్ బస్సెక్కి వెళ్ళాడు కార్తీక్.

‎రచన::-- అక్షర కిరీటితెన్నేటి మాస్టారు.

‎సెల్ :: 8247433432

‎

‎

‎

‎

‎

‎

‎

‎

‎

‎

‎

‎

‎

‎