features
ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో భాగంగా కుతుబ్ షాహీ సమాధుల వద్ద ‘ప్రకృతి – వారసత్వం సమ్మేళనం’ ప్రత్యేక వాక్ నిర్వహించిన తెలంగాణ పర్యాటక శాఖ
ప్రపంచ వారసత్వ వారోత్సవాల సందర్భంగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC), తెలంగాణ ప్రభుత్వ పురావస్తు మరియు వారసత్వ శాఖ, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ (AKTC) సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఇబ్రహీం బాగ్‌లో ఉన్న చారిత్రక కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణంలో ‘నేచర్ మీట్స్ హెరిటేజ్’ (ప్రకృతి – వారసత్వం సమ్మేళనం) పేరుతో ప్రత్యేక వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది వారసత్వ ప్రేమికులు, ప్రకృతి ఔత్సాహికులు, పక్షి పరిశీలకులు పాల్గొన్నారు. చారిత్రక కట్టడాల వైభవం, అద్భుతమైన నిర్మాణ శైలి, ప్రకృతి అందాలు, జీవవైవిధ్యం మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ కార్యక్రమం ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి మాట్లాడుతూ, తెలంగాణకు ఉన్న అపారమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు వారసత్వ సంపద ప్రాముఖ్యతను తెలియజేస్తూ, వాటి పరిరక్షణపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. కుతుబ్ షాహీ సమాధులు పర్షియన్, దక్కనీ, భారతీయ నిర్మాణ శైలుల సమ్మేళనానికి అద్భుతమైన ప్రతీకగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హెరిటేజ్ వాక్, నేచర్ వాక్‌ల ద్వారా పాల్గొన్నవారికి చారిత్రక కట్టడాల ప్రాముఖ్యత, వాటి నిర్మాణ శైలి, స్థానిక మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వృక్షజాతులు, వాటి పర్యావరణ ప్రాధాన్యత, పక్షుల ఆవాసాల పరిరక్షణలో వృక్షసంపద పాత్ర వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ప్రత్యేకంగా నిర్వహించిన పక్షుల పరిశీలన కార్యక్రమంలో పక్షుల కూతలు, వాటి ప్రత్యేక శారీరక లక్షణాల ఆధారంగా వివిధ జాతులను గుర్తించే పద్ధతులను వివరించారు. ఈ సందర్భంగా 40కి పైగా పక్షి జాతుల గురించి వివరించగా, స్పాటెడ్ అవుల్, బ్లాక్ డ్రోంగో, ప్లమ్ హెడ్డెడ్ పారకీట్, స్పాటెడ్ డవ్, బ్లాక్ కైట్, ఇండియన్ రాబిన్, గ్రీన్ బీ ఈటర్, కింగ్‌ఫిషర్, ఏషియన్ కోయల్, ఇండియన్ సిల్వర్‌బిల్, లిటిల్ స్విఫ్ట్ తదితర పక్షులను పాల్గొన్నవారు ప్రత్యక్షంగా వీక్షించారు.
ఈ సందర్భంగా TGTDC మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి క్రాంతి వల్లూరు, IAS మాట్లాడుతూ:
“తెలంగాణ వారసత్వ సంపద కేవలం చారిత్రక కట్టడాలకే పరిమితం కాదు. ఆ కట్టడాల చుట్టూ విస్తరించి ఉన్న ప్రకృతి, జీవవైవిధ్యం కూడా మన వారసత్వంలో అంతర్భాగమే. ‘నేచర్ మీట్స్ హెరిటేజ్’ కార్యక్రమం ద్వారా ప్రకృతి, సాంస్కృతిక వారసత్వం మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు, ముఖ్యంగా యువతలో వాటి పరిరక్షణ పట్ల అవగాహన, బాధ్యతను పెంపొందించడమే మా లక్ష్యం. సుమారు 50 మంది ఔత్సాహికులు పాల్గొనడం ఆనందదాయకం. ఇటువంటి కార్యక్రమాలు వారసత్వ పరిరక్షణ, పర్యావరణ అవగాహనతో పాటు బాధ్యతాయుతమైన అనుభవాత్మక పర్యాటక అభివృద్ధికి దోహదపడతాయి” అని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్ & పబ్లిక్ రిలేషన్స్) శ్రీమతి మన్వి పాల్గొన్న వారికి స్వాగతం పలుకుతూ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలను వివరించారు. వారసత్వ నిపుణులు, ప్రకృతి పరిశీలకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వాక్‌లు పాల్గొన్నవారికి చరిత్ర, నిర్మాణ కళ, పర్యావరణం, పక్షుల వైవిధ్యంపై విలువైన అవగాహనను అందించాయి.
తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడవ నేచర్ వాక్‌ను నవంబర్ 29, 2026, ఆదివారం నిర్వహించనున్నట్లు TGTDC ప్రకటించింది. ఆసక్తి గల వారు మరిన్ని వివరాలు మరియు రిజిస్ట్రేషన్ కోసం 80192 49292 నంబర్‌ను సంప్రదించవచ్చు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ, వారసత్వ శాఖ అధికారులు, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ప్రతినిధులు, వారసత్వ ప్రేమికులు, ప్రకృతి ఔత్సాహికులు పాల్గొన్నారు.