telangana
మానవత్వానికి మ్యానిఫెస్టో ‘చీకటి తరువాత’ నవల - కె. శ్రీనివాస్
ముషీరాబాద్ మేజర్ న్యూస్ :చీకటి కాలంలో మానవత్వపు వెలుగు రేఖల్ని ఆవిష్కరించిన నవల, మరుగున పడిన జ్ఞాపకాలను అన్వేషించిన నవల ఎండీ అబ్బాస్ రచించిన చీకటి తరువాత- అని ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు కె. శ్రీనివాస్ అన్నారు.ఎస్ వీ కే లో జరిగిన ఈ నవల పరిచయ సభలో ఆయన మాట్లాడుతూ... చరిత్రలో యుద్ధాలు జరుగుతాయి, అవి ముగుస్తాయి. రాజ్యాలు నిర్మించబడతాయి, ప్రజల వ్యతిరేకతతో అవి కూలిపోతాయి. అవే చరిత్రలా? కాదు.ఆ యుద్ధాల మధ్య ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతికిన మనుషులు, అలాంటి సంక్లిష్ట సమయంలో ప్రాణాలను కాపాడిన అనేక చేతులు, తలుపు తెరిచిన అనేక ఇళ్లు, చివరి క్షణంలో ఒక మనిషికి భరోసానిచ్చే ఒక మానవీయమైన మాట... ఇవన్నీ చరిత్రలో భాగం కావా? ఆ అన్వేషణలోంచి పుట్టిన నవలే అబ్బాస్ రచించిన ‘చీకటి తరువాత’ అని అన్నారు.మతాలు వేరు కావచ్చు, కానీ మనుషులకు ఉండే ఆకలి, దాహం, భయం, ప్రాణాల మీద ఆశ అందరికీ ఒకటే కదా! ఆ భయాన్ని అధిగమించి బాధితులకు ఆశ్రయం కల్పించడమే ఈ నవల యొక్క ప్రత్యేకత అని శ్రీనివాస్ అన్నారు.ఇదే సందర్భంగా మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ... ద్వేషంతో తలుపులు మూసుకుంటున్న సమాజం ఒకవైపు, మరోవైపు బాధితుల కోసం తలుపులు తెరుస్తున్న ఒక మానవత్వం... రచయిత ఒక మతాన్ని నిందించకుండా, హింసకు పాల్పడే వ్యక్తుల చర్యలను మాత్రమే ప్రశ్నిస్తారని అన్నారు.ఈ కార్యక్రమానికి భూపతి వెంకటేశ్వర్లు, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షత వహించగా, కవి యాకూబ్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర కార్యదర్శి కె. ఆనందాచారి, రచయిత్రి సలీమా, నవ తెలంగాణ వాసు, జి. రాములు తదితరులు పాల్గొన్నారు