కళ్యాణదుర్గం రూరల్ మండలంలో సెక్షన్ 163 అములు...
కళ్యాణదుర్గం: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కళ్యాణదుర్గం రూరల్ మండల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడంతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 163ను అమల్లోకి తీసుకొచ్చారు. ఈ మేరకు కళ్యాణదుర్గం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, తహసీల్దార్ ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్‌సీ నంబర్ 617/2026/సీ, తేదీ 13-11-2026తో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. రెండో విడత సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల వాతావరణంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సెక్షన్ 163 అమల్లో ఉన్న సమయంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడేందుకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరించడం, గుంపులుగా చేరి ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యే చర్యలకు పాల్పడటం నిబంధనలకు విరుద్ధమని హెచ్చరించారు. ఆంక్షలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని సూచించారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం, రాజకీయ సమావేశాలు, ఇతర కార్యక్రమాల నిర్వహణలో సంబంధిత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, వారి మద్దతుదారులు, గ్రామ ప్రజలు ఎన్నికల నియమావళితోపాటు అమల్లో ఉన్న ఆంక్షలను గౌరవించాలని సూచించారు. ఎన్నికల సమయంలో పరస్పర ఆరోపణలు, వాగ్వాదాలు, ఘర్షణలకు తావివ్వకుండా సంయమనం పాటించాలని కోరారు. పోలీసు, రెవెన్యూ అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టనున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు అమల్లో ఉండనున్న ఆంక్షల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజల సహకారం ఎంతో కీలకమని అధికారులు స్పష్టం చేశారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.