ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు
*ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి* . స్థానిక సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ట భద్రత కల్పిస్తామని, ఓటర్లను బెదిరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మిగనూరు రూరల్ ఎస్‌ఐ కె. శ్రీనివాసులు హెచ్చరించారు.కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, డీఎస్పీ ఏ. శ్రీనివాసులు, సీఐ ఎస్. చిరంజీవి పర్యవేక్షణలో మంగళవారం ఎమ్మిగనూరు మండలంలోని సమస్యాత్మక గ్రామమైన కడిమెట్లలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. రూరల్ ఎస్‌ఐ కె. శ్రీనివాసులు, నందవరం ఎస్‌ఐ ఎం. తిమ్మారెడ్డి, పట్టణ ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డితో పాటు మొత్తం 30 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో కవాతు నిర్వహించి అనుమానితులు, రౌడీషీటర్లు, వివాదాస్పద వ్యక్తుల ఇళ్లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఇరు పార్టీలకు చెందిన సమస్యాత్మక వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో అల్లర్లు, గొడవలకు పాల్పడినా, ఓటర్లను బెదిరించినా ఉపేక్షించేది లేదన్నారు.
సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అసత్య వార్తలు ప్రచారం చేయడం, గ్రామాల్లో రెచ్చగొట్టే బ్యానర్లు ఏర్పాటు చేయడం వంటివి చేస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దొంగతనాలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, మహిళలు, బాలికలు, చిన్నారులపై వేధింపులు, దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరూ చట్టానికి అతీతులు కారని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుందని ఎస్‌ఐ భరోసా ఇచ్చారు.
*A.R. శరత్ కుమార్ సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా*