హైదరాబాద్ వీధుల్లో విజయ్ ఆంటోనీ సందడి.. అమీర్‌పేటలో మిర్చి బజ్జీలు వేసి ఇరానీ చాయ్ తాగిన స్టార్ హీరో
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సినిమా ప్రమోషన్ల విషయంలో ఎప్పుడూ విభిన్నమైన పంథాను ఎంచుకునే ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ తాజాగా హైదరాబాద్ నగర వాసులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన కొత్త చిత్రం నాన్న కుట్టి ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆయన నగరంలోని అమీర్‌పేట వీధుల్లో ప్రత్యక్షమయ్యారు. చిత్ర కథానాయిక ప్రీతి ఆస్రానీ మరియు ఇతర చిత్ర బృందంతో కలిసి సాధారణ వ్యక్తిలా రోడ్లపై కలియదిరిగారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించిన విజయ్ ఆంటోనీ, ఒక బండి వద్ద స్వయంగా మిర్చి బజ్జీలు వేసి అక్కడున్న స్థానికులకు, అభిమానులకు పంచిపెట్టారు. స్టార్ హీరో తమ మధ్యకు వచ్చి బజ్జీలు వేయడం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.
మిర్చి బజ్జీలు వేసిన అనంతరం విజయ్ ఆంటోనీ, ప్రీతి ఆస్రానీ కలిసి అమీర్‌పేటలోని ఏషియన్ సత్యం మాల్ సమీపంలో ఉన్న ఒక ఇరానీ కేఫ్‌కు వెళ్లారు. అక్కడ సాధారణ కస్టమర్ల మాదిరిగానే కూర్చుని వేడివేడి ఇరానీ చాయ్ తాగుతూ బన్ మస్కా రుచి చూశారు. బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ తమ ప్రాంతానికి వచ్చారన్న విషయం తెలియడంతో స్థానికులు, అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అభిమాన నటుడితో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీ పడటంతో అమీర్‌పేట పరిసరాల్లో కొద్దిసేపు పండుగ వాతావరణం నెలకొంది. సుమారు అరగంట పాటు సాగిన ఈ పర్యటనలో విజయ్ ఏమాత్రం అసహనం చూపకుండా అందరితో కలిసిపోయి ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
నిజానికి నాన్న కుట్టి సినిమా ప్రమోషన్ల కోసం విజయ్ ఆంటోనీ కొద్ది రోజులుగా ఇలాంటి వినూత్న కార్యక్రమాలనే నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితమే చెన్నై నుంచి కోయంబత్తూరుకు సాధారణ రైలులోని జనరల్ బోగీలో ప్రయాణించి ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు. ఖరీదైన హోటళ్లలో ప్రెస్ మీట్లు పెట్టడం కంటే నేరుగా సామాన్య ప్రేక్షకుల మధ్యకు వెళ్లి వారితో సమయం గడపడం ద్వారా తన సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్ వేడుకలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు పూర్తి చేసింది.
ము. మారన్ దర్శకత్వంలో తెరకెక్కిన అప్పా కుట్టి చిత్రాన్ని తెలుగులో నాన్న కుట్టి పేరుతో విడుదల చేస్తున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే బలమైన అనుబంధం, భావోద్వేగాలకు క్రైమ్ మరియు సస్పెన్స్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారు. తన కూతురిని ప్రమాదాల నుంచి కాపాడుకునేందుకు ఒక తండ్రి చేసే పోరాటం ఈ కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. విజయ్ ఆంటోనీ స్వయంగా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మీరా విజయ్ ఆంటోనీ నిర్మించగా, ఈ నెల 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్న ప్రచారంతో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read: పెద్ది పాట వివాదంపై శ్రుతి హాసన్ స్పష్టత.. జాన్వీ కపూర్ వ్యాఖ్యలపై ఆసక్తికర కామెంట్స్