telangana
కృష్ణకాంత్ పార్కులో.. మార్నింగ్.. వాకింగ్.. టాకింగ్..! వాకర్స్ తో హైడ్రా కమిషనర్ మాటామంతీ
వెంగళరావునగర్, మేజర్ న్యూస్:కృష్ణకాంత్ పార్కులో ఆదివారం ఉదయం హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ మార్నింగ్ వాక్ చేశారు. అక్కడి వాకర్స్ తో మాట్లాడారు. కృష్ణకాంత్ పార్కులో 3 ఎకరాలకు పరిమితమై మురికి కూపంగా మారిన చెరువును 12 ఎకరాలకు విస్తరిస్తూ పునరుద్ధరిస్తున్న అంశంపై చర్చించారు. ఈ చెరువులోకి వరదనీరు నేరుగా చేరేలా ఇన్ లెట్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. భారీ వర్షం పడినప్పుడు జూబ్లీహిల్స్, వెంకటగిరి నుంచి పెద్ద మొత్తంలో వచ్చే వరద నీరు కృష్ణానగర్, యూసుఫ్గూడ మధురానగర్ శ్రీనివాస్ నగర్ అమీర్ పేట్, మైత్రి వనం పరిసరాలను ముంచెత్తకుండా కృష్ణకాంత్ పార్కు చెరువుకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. చెరువు లోతును పెంచి వరద నీరు నిలిచేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. చెరువు అభివృద్ధికి సూచనలు వారి నుంచి స్వీకరించారు.
పార్కులో సమస్యలపై ఫిర్యాదు.
ఈ సందర్భంగా కృష్ణకాంత్ పార్కులో వాకర్స్ తో పాటు సందర్శకులు ఎదుర్కొంటున్న సమస్యలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు అక్కడి వారు ఏకరువు పెట్టారు. పార్కు సౌత్ వైపు చెత్త డంపింగ్ యార్డు ఉంది.. అటువైపు ప్రహరీ లేకపోవడంతో దుర్వాసనతో పాటు చెత్తాచెదారం పార్కులోకి చేరుతోందన్నారు. జిమ్ ఎక్విప్మెంట్ పాడయ్యిందని.. వాటిని సరి చేయడమే కాకుండా మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఇటీవల తమ్మిడి కుంట లో హైడ్రా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ఎంతో బాగుందని.. చెరువు అభివృద్ధిలో భాగంగా ఇక్కడ కూడా అలాగే సమకూర్చాలని కోరారు. చెరువుతో పాటు పార్కు అభివృద్ధి జరిగేలా చూడాలని వాకర్స్ విజ్ఞప్తి చేశారు. నగరంలో హైడ్రా పునరుద్ధరించిన చెరువులు ఎంతో బాగున్నాయని.. చెరువు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని రుజువు చేస్తున్నాయని వాళ్లు అభినందించారు. దాదాపు గంట పాటు సాగిన మార్నింగ్ వాకింగ్ ప్రకృతి పరిరక్షణకు విలువైన సూచనలకు మార్గంగా మారింది.