BREAKING
'ఎల్లమ్మ'లో దేవిశ్రీ నటన చూసి షాక్ అవుతారు: వేణు 'ఈ నగరానికి ఏమైంది 2'లో కార్తీక్ పాత్రపై శ్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు జై శంభవేశ్వరా..కథ 'కిరికిరి' సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన దిల్ రాజు గతంలో ఎంపీటీసీగా గెలుపు.. ఇప్పుడు సర్పంచ్ బరిలో మారుతి రెడ్డి! శర్వానంద్ 'భోగి' ట్రైలర్ రిలీజ్.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్ బంగారం, వెండి ధరలు డౌన్.. సోమవారం తులం ఎంతంటే? ఇఫీ 2026లో 'రామాయణ' ప్రదర్శన.. దేశానికి గౌరవం: నితీష్ తివారీ 'డేంజర్ బాయ్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్.. నవంబర్ 27న రిలీజ్ 'వృషకర్మ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. నవంబర్ 25న గ్రాండ్ ఈవెంట్ 15 దేశాల్లో రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేసిన తొలి ఇండియన్ సినిమా 'బాల 369': విజయ్ కుమార్ కలివరపు హై సినిమా చూశాను.. జెన్ జీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్‌తో అద్భుతంగా తీశారు: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి మోక్షప్రదాయకం.. మహా పవిత్రం కార్తీక సోమవారం! 7వ వార్డు అభ్యర్థిగా ముంతాజ్ బేగం నామినేషన్ దాఖలు "పడాల" నామినేషన్ కు భారీ ఏర్పాట్లు

జై శంభవేశ్వరా..కథ

Select Suryaa Now
జై శంభవేశ్వరా..కథ

జై శంభవేశ్వరా..కథ

‎అదొక అందమైన పల్లెటూరు. గోస్తనీ నదీ తీర ప్రాంతాన విలసిల్లే చారిత్రక ప్రాశస్థ్యం గల శంభుపురం. శంభుపురాన్ని పాలించిన శంభు రాజ వంశాల కులదైవం శ్రీ శక్తి సమేత శంభవేశ్వరుడు. ఆయన స్వయంభువుగా ఆ శంభుపురాన వెలసి భక్తుల పూజలందుకొంటూ కోరికలు తీరుస్తున్నాడు. ఇది కొన్ని దశాబ్దాల క్రితం చరిత్ర.

‎శ్రీ శక్తి సమేత శంభవేశ్వరాలయం లో గల శిలా శాసనాలు, తామ్ర శాసనాలలో ఆ వూరి చరిత్ర గురించి, ఆ క్షేత్రాన్ని గురించి, ఆ ప్రాంతాలను పాలించిన శక్తి, శంభు, నంది రాజ వారి వంశాల గురించి, వారు చేసిన దాన ధర్మాల గురించి ప్రాచీన లిపులలో విపులంగా రాయబడినది. పలు విశ్వ విద్యాలయాల నుండి ఆ దేవాలయానికి పరిశోధక విద్యార్ధులు వచ్చి శాసనాల ఆధారంగా ఎన్నో పరిశోధనలు చేసి భవిష్యత్తరాల వారికి చారిత్రక, ప్రాచీన కాలానికి చెందిన అంశాలను, వాటిని మనం రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ వ్యాసాలు, పుస్తకాలు వ్రాసి యూనివర్శిటీల నుండి డాక్టరేట్స్ పొందారు. పరిశోధనల నిమిత్తం ఆ దేవాలయాలకు చాలామంది రావడం వలన శంభుపురం లోని హొటళ్ళు, లాడ్జీలు ఎప్పుడూ నిండిపోతున్నాయి. అందువలన ఆ హోటల్స్ వారికి, రవాణా వ్యవస్థ కు, దేవాలయ పరిసర ప్రాంతాల చిల్లర వ్యాపార సముదాయాల వారికి, తద్వారా పంచాయితీ వారికి ఆదాయం బాగా వచ్చేది. శంభవేశ్వరాలయం ఆధ్యాత్మిక భక్తి కేంద్రంగా, పర్యాటక రంగంగా కూడా బాగా అభివృద్ధి చెందింది. ఈ విధంగా కొంత కాలం క్రితం వరకూ దేవాలయం వైభవం కొనసాగినది.

‎

‎కాలం మారింది. ప్రజా నాయకులు వచ్చారు. భక్తుల సౌకర్యార్థం నాయకులు సదుపాయాలు ఆధునిక హంగులతో ఏర్పాటు చేయాలనుకున్నారు. నాయకుల కనుసన్నల్లో మెలిగే దేవాలయ పాలకవర్గం అందరూ కలిసి రీమోడలింగ్ అంటూ పనులు ప్రారంభించారు. గుడి పక్కనే సుమారు రెండెకరాల విస్తీర్ణంలో గల నందిగుండం ను కొంతమేర పూడ్చి అక్కడ అందమైన పార్క్ దానితోపాటే ఓ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనీ, రంగుల చిత్రాలతో బహు సుందరంగా తీర్చిదిద్దటం కోసం రాతి సున్నంతో నిర్మితమైన స్థంభాలను, గోడలను కొంతవరకూ తొలగించాలనీ, పనులు మొదలెట్టారు.

‎సర్వ మతాలవారు దేవాలయ పాలకవర్గం లో నాస్తికులైన కొందరు సభ్యుల ప్రోత్సాహం తో, నాయకుల అండదండలతో చరిత్ర, ప్రాశస్త్యం, పురాణేతిహాసాల నమ్మకాలు వీటి అన్నిటినీ తోసేసి ఆధునికత పేరుతో పాలకవర్గం చైర్మన్ వెంకుసాబు పనులు ప్రారంభించేసాడు.

‎అంతంతమాత్రంగా వచ్చే భక్తులు, గ్రామాన్నే అంటిపెట్టుకున్న పురజనులు కొందరు పనులు చేయటం కుదరదన్నారు. అలా చేయడం వలన దేవాలయ గోడలపై, నంది గుండం చుట్టూ ఉన్న శాసనాలు మరుగున పడిపోతాయని అందువల్ల గుడిలో పనులు చేయటానికి వీల్లేదన్నారు. అక్కడే దేవాలయం పక్కనే వుంటోన్న నంది వంశ వారసుడు దుర్గరాజు ఏడు పదుల వయసులో దేవాలయం లో జరిగే పనులను కొందరు భక్తుల సహకారంతో ఆపటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దుర్గరాజు గుడిని, నందిగుండాన్ని ఎటువంటి మార్పులు చేర్పులు చేయవద్దంటూ కోర్టులో కేసు వేసారు.

‎కోర్టు వారు ఆరునెలలు ఎటువంటి పనులు చేయకూడదు అని, ఈ ఆరునెలల కాలంలో గుడి కి, నందిగుండానికి సంబంధించిన చారిత్రాత్మక, పౌరాణిక, ఇతిహాసాల సాక్ష్యాలను కోర్టు వారికి అందజేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. దానితో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.

‎

‎"ఇలా ఎంతకాలమండీ ? ఆ దుర్గరాజు కి భయపడి పనులు ఆపేయడం, అవతల పెట్టుబడుల కోసం తెచ్చిన డబ్బులు ఆగిపోతున్నాయి. వ్యాపారాలు జరగడం లేదు" అంటూ కంట్రాక్టర్ ఎలమంద అనేసరికి 'ఎలమందా! కంగారు పడితే పనులవుతాయా? కోర్టు వారు అడిగిన ఆధారాలను ఆ దుర్గ రాజు చూపాలి కదా!. అవన్నీ ఇప్పుడు ఎక్కడ్నించి తెస్తాడు? ఆ ముసలాయన" అంటూ వెంకుసాబ్ నవ్వసాగాడు. "వెంకూ సాబ్ ! అలా ఎవరినీ తేలిగ్గా తీసిపారేయొద్దు. ఆ దుర్గ రాజు నంది వంశానికి చెందినవారు. ఏదైనా సాధించగలరు". అని నాయకులు రంగప్ప అనగానే "ఏంటప్పా మీరనేది? అంటే మనమేం చేయలేమా? అడ్డేస్తే నా సోడాలో గోళీ ఏరి పారేస్తానం"టూ మీసం దువ్వుకోసాగాడు సభ్యుడు నారప్ప.

‎

‎"అదిగో ఆ కంగారే వద్దనేది వేచి చూద్దాం. ఏది ఏమైనా మనమే నెగ్గుతాం". అని రంగప్ప అనగానే "సరే ఆ విషయాలు తర్వాత మాటాడుకుందాం. సోడాలో గోళీ సంగతి చూద్దాంరండం"టూ నారప్ప అనగానే సభ్యులందరూ సోడాల పని పట్టారు.

‎

‎ఇది జరిగిన ఓ పది రోజుల తర్వాత మామాడి చెట్టు సెంటర్లో పెద్ద మీటింగ్ లో దుర్గరాజు మాట్లాడుతూ "ఓం శంభవేశ్వరాయనమః..చూడండి మన వూరిలో కొలువైన శంభవేశ్వరుని గుడి చాలా ప్రాచీనమైనది. ఎన్నో శాసనాలు ఉన్నాయి కదా!. వాటిని అన్నింటిని తొలగించి పక్కనే ఉన్న నంది గుండాన్ని పూడ్చాలనీ కొందరు దౌర్జన్యంగా పనులు మొదలు పెట్టారు. నేను కోర్టులో పిటీషన్ వేసాను. పనులు ఆపమన్నారు. కోర్టు వారిచ్చిన గడువు ఇంకో పదిరోజులలో అయిపోతుంది. మనం ఏం చేయలేం? ఇంక ఆ శంభవేశ్వరుడిని ఆయనే కాపాడుకోవాలి" అంటూ ఎన్నో చారిత్రక విషయాలు చెప్పుకొచ్చారు. "అయ్యా! నేను 'సేవ్ ది టెంపుల్స్' అనే ప్రోగ్రామ్ చేస్తూ, మీడియాలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రజలను చైతన్యపరుస్తున్నాను. నా పేరు టెంపుల్ రాకేష్. నా దగ్గర మీ గుడికి సంబంధించిన కొన్ని ఆధారాలు ఉన్నాయి. వాటిని అన్నింటిని మనం కొర్టులో సబ్మిషన్ చేస్తే మనం విజయం సాధిస్తాం. నేను కూడా ఈ వూరి వాడినే". అని చెప్పగానే దుర్గరాజు "చాలా సంతోషంగా వుంది. ఆ శంభవేశ్వరుడే నిన్ను పంపాడు నాయనా! చెప్పు మేమంతా ఏం చేయాలి?" అని అడగ్గానే "అవును చెప్పండి మీరు చెప్పినట్టు చేస్తాం "అంటూ అక్కడ గుమిగూడిన భక్తులందరూ అడిగారు. "చూడండి ఈ నందిగుండంలో జలం చాలా పవిత్రమైనది ఈ జలంతో స్నానం చేసినా, ప్రతీరోజూ క్రమం తప్పకుండా నెల రోజుల పాటు తాగినా ఎటువంటి రోగాలు రావు. పైగా ప్రకృతి వైపరీత్యాలు, ఎటువంటి దీర్ఘకాలిక రోగాలు రావు, అన్నిటి కన్నా నమ్మలేని నిజం ఏమిటంటే అల్జీమర్స్ నివారణ కు వాడే మందులను ఈ నందిగుండం లో నీటితో తయారుచేసేవారు. ఎందుకంటే ఈ నీటిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువలన సుమారు పాతికేళ్ళ క్రితం వరకూ ఈ నీటిని విదేశాల మందుల కంపెనీల వారు పట్టుకెళ్ళేవారు. ఇప్పుడు కొత్త రకం మందుల తయారీకి ఈ నీటిని వాడటం కోసం కొంతమంది వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు". అని చెప్పగానే ఆ వూరి పాత ప్రసిడెంట్ నరసింహం గారు "అవును ఈయన చెప్పేవన్నీ నిజమే. మా తాత, ముత్తాతలు సర్పంచ్ గా వున్న సమయంలో అదేదో  మందుల కంపెనీ వారనుకుంటా, వారొచ్చి ఈ నీటిని తీసుకెళ్ళే వారప వేయి లీటర్ల నీటికి సుమారుగా లక్ష రూపాయలు చెల్లించేవారు. ఆ డబ్బులతో గుడిని, మన వూరిని అభివృద్ధి చేసేవారట. కాలం మారింది కదా, పెత్తనాలు చేతులు మారాయి" అని చెప్పగానే "ఆయన చెప్పింది నిజమే ఈ నీటిలో అమృతం వుంది. ఈ నీటిని సర్వ రోగ ఔషధంగా వాడేవారు ఆనాటి పదో శతాబ్దంలోని వారు" అని సురేందర్ అనే ప్రొఫోసెర్ చెప్పారు.

‎

‎ఈ విషయాలన్నిటినీ టెంపుల్ రాకేష్ లైవ్ ప్రోగ్రాం చేస్తున్నాడు. చాలామంది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. వ్యూవర్స్ లిస్ట్ పెరుగుతోంది. "రండి మనమంతా దుర్గరాజు గారి నాయకత్వంలో మన గుడిని కాపాడుకుందాం "అంటూ రాకేష్ చెప్పేసరికి "సేవ్ ది అవర్ టెంపుల్" అంటూ అరిచారు. "జై భోలో శంభవేశ్వరా..! నువ్వే నడిపించాలి మమ్మల్ని. నిన్ను నువ్వే కాపాడుకోవాలి" అంటూ ముగించారు దుర్గరాజు ఆనాటి సభను.

‎

‎ఇది జరిగిన రెండు రోజులలో కోర్టు వారిచ్చిన గడువు పూర్తయిపోయింది. "పదండెహే మనల్ని ఎవడాపుతాడో చూద్దామం?"టూ కంట్రాక్టర్ ఎలమంద జే.సీ. బీ ఎక్కి గుడి గోడ మీద పెట్టి పడగొట్టబోతుంటే "జై శంభవేశ్వరా! రేయ్ ప్రాచీన కాలానికి అందునా మా పూర్వీకులకు చెందిన ఈ గుడిని ధ్వంసం చేస్తుంటే చూస్తూ వూరుకునేది లేదం"టూ

‎దుర్గరాజు తదితరులు అడ్డు నిలబడేసరికీ

‎పక్కనే వున్న గడ్డపార తీసుకొని "రండి ఎవరొస్తారో రండి ఈ గునపం మీ గుండెల్లో సూటిగా దింపుతాను"అంటూ రంగప్ప అనేసరికీ

‎"ఏయ్ రంగప్పా! మీ దౌర్జన్యాన్ని చూస్తూ వూరుకునేది లేదం"టూ సురేష్ "సేవ్ ది టెంపుల్" అంటూ గట్టిగా అరిచేసరికి వందలాదిమంది" సేవ్ ది టెంపుల్ "అనే

‎ప్ల కార్డులు పట్టుకొని గుడి దగ్గర గుమిగూడి పోయారు.

‎

‎అనుకోని ఈ పరిణామానికి కంగారు పడి రంగప్ప

‎"లాగి పాడేయండి ఒక్కొక్కరినీ ఏం జరుగుతుందో చూద్దాం" అనగానే కర్రలు, రాళ్ళు పైకి లేచాయి. హాహాకారాలు వినబడ్తున్నాయి.

‎

‎అంతలో "ఆగండాగండి ఎవ్వరూ ఈ గుడిని కానీ, ఈ నందిగుండాన్ని కానీ ఏ విధమైన మార్పులు చేర్పులు చేయటానికి వీల్లేదంటూ కోర్టు వారు దుర్గరాజు గారికి అనుకూలంగా తీర్పునిచ్చారు." అంటూ జిల్లా కలెక్టర్ గారు భానుమూర్తి కారు దిగుతూ కాగితాలు చూపించారు. వెంటనే రంగప్ప "ఏంటి సార్ మీరు వచ్చారు? ఇంత చిన్న విషయానికి"అంటూ తెగ హడావుడి చేయసాగాడు. రంగప్ప మనుషులందరూ దాక్కోపోయారు. "చూడండి రంగప్ప గారు ఈ శంభవేశ్వరుడు చాలా మహిమ గల దేవుడు. ఈ దుర్గరాజు గారు నందివంశానికి చెందిన వారు. ఈ సురేష్, ఆ ప్రొఫేసర్ గారు మీడియా ద్వారా చేసిన ఉద్యమం చాలా బలమైనది. ఈ గుడి కి, ఆ నందిగుండానికి సంబంధించిన వాటిని ఈనాటి తరానికి తెలియని ఎన్నో విషయాలను చాలా శ్రమకోర్చి సాధించి కోర్టు వారికి సాక్ష్యాధారాలు సమర్పించారు" అంటూ చెబుతోన్న సమయంలో సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ శివరాజ్ పాటిల్ గారు వచ్చి "దుర్గరాజు గారు మీరు అభినందనీయులు మీరు సుమారు పదేళ్ళనుంచి చేస్తున్న ఒంటరి పోరాటం ఈరోజు విజయం సాధించింది. ఈ గుడిని మేం హేండోవర్ చేసుకుంటున్నాం. భవిష్యత్తరాల వారికి మన ప్రాచీన వైభవం, ప్రాశస్త్యం తెలియజేసే చారిత్రక సాక్ష్యమైన ఈ గుడిని యధాతధంగా వుంచి దాని నిర్వహణ, రక్షణ బాధ్యత మేం తీసుకుంటున్నామ"ని చెప్పగానే "జై దుర్గరాజు" అంటూ అరవసాగారు. "అంతా ఆ శంభవేశ్వరుని అనుగ్రహమే మన గుడి పదిలం. మా పూర్వీకుల ఆచారం ప్రకారం వైశాఖం మాసంలో స్వామివారి కళ్యాణం పండుగలా చేసుకుందాం. "అని చెప్పగానే మన చారిత్రక వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యాలు మన గుడులు, గోపురాలు వాటిని కాపాడుకుందాం. ఈ పోరాటంలో విజయం సాధించిన మన దుర్గరాజు గారికీ ఈ ఏడాది మన కేంద్ర ప్రభుత్వం నుండి నంది బహుమతి ఇవ్వాల్సినదిగా సిఫారసు చేస్తున్నా "నంటూ కలెక్టర్ గారు వెళ్ళిపోయారు. రంగప్ప దుర్గరాజు దగ్గరకొచ్చి "దుర్గరాజు గారు మీ దేవుడుని మీరు కాపాడుకున్నారు. మీకు  నమస్కారము" అనగానే "మనమెంత ఆ శంభవేశ్వరుని ముందు, మనమంతా నిమిత్త మాత్రులం నాయనా! మన ఊపిరి మన ఉనికి అన్నీ ఆ శంభవేశ్వరుడే. జై బోలో శంభవేశ్వరా" అనగానే "జై జై శంభవేశ్వరా" అంటూ ఆ పరిసరాలన్నీ మారు మ్రోగసాగాయి.

‎

‎రచన ::-- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు

‎సెల్ :::--8247433432

‎

‎