శర్వానంద్ 'భోగి' ట్రైలర్ రిలీజ్.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం భోగి ట్రైలర్‌ను మేకర్స్ ఘనంగా విడుదల చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో చిత్రబృందం ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించగా, ఆద్యంతం ఉత్కంఠభరిత సన్నివేశాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీ రాధామోహన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు నవంబర్ 27న భోగి సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ ట్రైలర్‌లో శర్వానంద్ మునుపెన్నడూ చూడని ఊరమాస్, రా అండ్ రస్టిక్ అవతార్‌లో కనిపించి అభిమానుల్లో జోష్ నింపారు. 1960ల ప్రారంభంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఓ కల్పిత గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఇందులో గంగ అనే పవర్‌ఫుల్ పాత్రలో శర్వానంద్ నటిస్తుండగా, ఐదుగురు చెల్లెల్లకు అన్నగా భావోద్వేగాలతో కూడిన పాత్రలో మెప్పించనున్నారు. హై ఇంటెన్సిటీ యాక్షన్, ప్రతీకారం, కుటుంబ అనుబంధాల మేళవింపుతో సంపత్ నంది ఈ చిత్రాన్ని మలిచిన తీరు ట్రైలర్‌లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
భోగి చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తుండగా, శరత్ శ్వత్, లాల్, అవినాష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక విభాగాల పనితీరు ట్రైలర్‌కు మరింత బలాన్ని చేకూర్చింది. కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ గ్రామీణ నేపథ్యాన్ని సహజంగా ప్రజెంట్ చేయగా, భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని తీవ్రతను పెంచాయి.
విభిన్నమైన పీరియడ్ బ్యాక్‌డ్రాప్, శర్వానంద్ మాస్ పెర్ఫార్మెన్స్, సంపత్ నంది మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో విడుదలైన భోగి ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి స్పందనను అందుకుంటోంది. నవంబర్ 27న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త యాక్షన్ అనుభూతిని అందిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.