'వృషకర్మ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. నవంబర్ 25న గ్రాండ్ ఈవెంట్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: యువ సామ్రాట్ నాగ చైతన్య విభిన్నమైన పాత్రలో నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రం వృషకర్మ. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఎస్‌వీసీసీ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైథాలజీ, మిస్టరీ, సస్పెన్స్ అంశాల కలయికతో భారీ సినిమాటిక్ స్పెక్టకల్‌గా రూపొందిస్తున్నారు. పురాతన రహస్యాలు, ఉత్కంఠభరిత మలుపులతో కూడిన సరికొత్త కథా ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది.
తాజాగా వృషకర్మ ట్రైలర్‌ను నవంబర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. నెల్లూరులోని ఎస్‌వీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో నిర్వహించే గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు. ట్రైలర్ ప్రకటనతో విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ పోస్టర్‌లో నాగ చైతన్య తీవ్రమైన భావోద్వేగంతో, భుజంపై తాడు వేసుకుని ఒక చేతిని ముందుకు చాపిన స్టైలిష్ అవతారంలో ఆకట్టుకుంటున్నారు. కళ్లద్దాలు, ఒత్తైన గడ్డంతో జయరామ్ కనిపిస్తుండగా, కళ్లద్దాలు ధరించిన మీనాక్షి చౌదరి చేతిలో మండుతున్న వస్తువును పట్టుకుని కనిపించడం పోస్టర్‌కు మిస్టికల్ హంగును అద్దింది.
డార్క్, ఎర్తీ టోన్స్‌తో డిజైన్ చేసిన ఈ పోస్టర్‌లో ఎర్రటి పొగ, వెలుగుతున్న అంశాలు, పురాతన కాలాన్ని తలపించే వృత్తాకార చిహ్నాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ దృశ్యాలు సినిమాలో దాగి ఉన్న మిస్టరీ ప్రపంచంపై క్యూరియాసిటీని రేకెత్తిస్తున్నాయి. కీలక విలన్ పాత్రలో స్పర్శ్ శ్రీవాస్తవ నటిస్తుండగా, ప్రధాన పాత్రధారుల లుక్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.
సాంకేతిక బృందం ప్రతిభ ఈ ప్రాజెక్టుకు అదనపు బలంగా నిలుస్తోంది. రఘుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, బి. అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. నవంబర్ 25న ట్రైలర్ విడుదల కానుండటంతో వృషకర్మ కథాంశంపై మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి రానున్నాయి. డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త థ్రిల్‌ను అందిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: 15 దేశాల్లో రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేసిన తొలి ఇండియన్ సినిమా 'బాల 369': విజయ్ కుమార్ కలివరపు