ఎన్నికల వేళ గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
బాడంగి, నవంబరు 22 (మేజర్ న్యూస్): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బాడంగి మండలంలోని పాల్తేరు, హెచ్.పాల్తేరు, మల్లంపేట, అనవరం, బొత్సవానివలస గ్రామాల్లో ఆదివారం పోలీసుల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బాడంగి ఎస్సై పి. సూర్యకుమారి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజల్లో భద్రతా భావం పెంపొందించడంతో పాటు, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిని ఉపేక్షించబోమనే స్పష్టమైన సందేశాన్ని అందించడమే లక్ష్యమన్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.