ఘనంగా ఆర్యవైశ్య వన అన్న సమారాధన! ఆటపాటలతో సందడిగా సాగిన వేడుకలు.. పూర్వ సంఘ అధ్యక్షులు, ఆర్యవైశ్య ప్రముఖులకు ఘన సన్మానం
టి. నరసాపురం,మేజర్ న్యూస్,గ్రామంలోని ముత్యాలమ్మపేటలో అద్దంకి జగ్గారావు గారి తోటలో ఆదివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి ఆటపాటలు, సందడి మధ్య ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు.ముందుగా గోపూజ నిర్వహించి, అనంతరం కార్తీక దామోదర పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తదుపరి అన్న సమారాధనలో కుటుంబ సభ్యులందరూ పాల్గొని విందును ఆస్వాదించారు. అనంతరం నిర్వహించిన వివిధ ఆటలు, పాటలు, వినోద కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆటపాటల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేసి ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, ద్వారకాతిరుమల వాసవి కళ్యాణ మండప సత్రం అదనపు ప్రధాన కార్యదర్శి వంటిపల్లి వెంకటేశ్వరరావును ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా టి. నరసాపురం గ్రామంలో ఇప్పటివరకు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా సేవలందించిన జూలూరు గోపాలరావు,అద్దంకి జగ్గారావు, మండమా ఆదిత్య కుమార్,అద్దంకి రామకృష్ణ,వంటిపల్లి సత్యనారాయణ,మాదంశెట్టి సోమరాజు,మాదంశెట్టి మల్లికార్జునరావు,నల్లూరి శ్రీనివాసరావు,పమిడి శ్రీనివాసరావులతో పాటు మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మండం సత్యనారాయణమూర్తిని ఘనంగా సన్మానించారు. వారి సేవలను గుర్తుచేసుకుంటూ పేరుపేరునా అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వంటిపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని సూచించారు. ఇప్పటివరకు వ్యాపార రంగానికే ఎక్కువగా పరిమితమైన ఆర్యవైశ్యులు ఇకపై వ్యాపారాలతో పాటు రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, సామాజిక సేవ వంటి అన్ని రంగాల్లోనూ తమదైన ముద్ర వేయాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యా, ఉద్యోగ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఐకమత్యం, క్రమశిక్షణ, సేవాభావం ఆర్యవైశ్యుల బలమని, సంఘటితంగా ఉంటూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని మండల ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు పసుమర్తి రాము, గ్రామ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు అద్దంకి గిరికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అద్దంకి సునీత,వంటిపల్లి సంతోషి, నల్లూరి మణికంఠ,లు వ్యాఖ్యాతగా చేస్తూ
ఈ కార్యక్రమం కేవలం వన సమారాధనకే పరిమితం కాకుండా ఆర్యవైశ్య కుటుంబాల మధ్య ఆత్మీయ అనుబంధాలకు, సంఘ ఐక్యతకు వేదికగా నిలిచింది. గతంలో సంఘానికి సేవలందించిన పెద్దలను గుర్తించి గౌరవించడం,ప్రస్తుత తరానికి వారి సేవలను పరిచయం చేయడం, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినివ్వడం ఈ వేడుకలో ప్రత్యేకతగా నిలిచాయి.ఆటపాటలతో చిన్నారులు,యువత సందడి చేయగా పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల సందేశాలతో కార్యక్రమం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఏడాదికోసారి జరిగే ఈ వన సమారాధన ప్రతి కుటుంబాన్ని ఒక్కచోట చేర్చి, మనమంతా ఒకే కుటుంబం అనే ఐక్యతా భావాన్ని చాటిచెప్పింది. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు భవిష్యత్తులోనూ కొనసాగాలని, ఆర్యవైశ్య సంఘం ఐక్యతతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య ప్రముఖులతో పాటు గ్రామ ఆర్యవైశ్య సంఘ సభ్యులు అందరూ కుటుంబతో పాల్గొన్నారు.