'డేంజర్ బాయ్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్.. నవంబర్ 27న రిలీజ్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: వికాస్ ఉత్తయ్య, రాధా భగవతి, అశ్విన్ హసన్, రాఘవ్ కొడబాద్రి, మిథున్ తీర్ధహళ్లి ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం డేంజర్ బాయ్స్. యశశ్విని క్రియేషన్స్ బ్యానర్‌పై వి.జి.మంజునాథ్ మరియు పూర్ణిమ ఎమ్.గౌడ్ నిర్మించిన ఈ చిత్రానికి అభిజిత్ తీర్ధహళ్లి దర్శకత్వం వహించారు. సునాద్ గౌతమ్ సంగీతం, సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమా తెలుగులో నవంబర్ 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో డేంజర్ బాయ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్రబృందం ఘనంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో హీరో వికాస్ ఉత్తయ్య మాట్లాడుతూ తమ సినిమా కథాంశం దట్టమైన అటవీ ప్రాంతంలో సాగుతుందని, ఇలాంటి కథలను సాధారణంగా సెట్స్‌లో తీస్తారని అయితే తాము మాత్రం నిజమైన అడవిలోనే షూటింగ్ చేశామని వెల్లడించారు. కన్నడలో నలభై సినిమాలతో పోటీపడి విడుదలైనప్పటికీ ఆరు వారాల పాటు హౌస్‌ఫుల్ షోలతో ప్రదర్శింపబడిందని, ఇది ఓటీటీలో కాకుండా థియేటర్లలో అనుభూతి చెందాల్సిన చిత్రమని, అందుకే ఓటీటీకి ఇవ్వకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు. నటి హరిణి మాట్లాడుతూ ప్రమోషనల్ కంటెంట్‌లో తాను కనిపించకపోవడంతో తన పాత్రపై ఆసక్తి నెలకొని ఉండవచ్చని, చాలా భిన్నమైన మరియు ఆసక్తికరమైన పాత్రలో ప్రేక్షకులను అలరిస్తానని పేర్కొన్నారు.
నటుడు మిథున్ తీర్థహళ్లి మాట్లాడుతూ ఈ చిత్రంలో గాబ్రి అనే పిరికివాడి పాత్రలో నటించానని, ఏమాత్రం ధైర్యం లేకుండా ప్రతి విషయానికి భయపడే ఆ పాత్ర కథలో జరిగే కీలక సంఘటనల మధ్య ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు. నటుడు అశ్విన్ హాసన్ మాట్లాడుతూ నటీనటులుగా అంతగా గుర్తింపు లేని తమకు ఈ సినిమా కన్నడలో మంచి పేరు తీసుకొచ్చిందని, కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో నిర్మాత హక్కులు ఎవరికీ అమ్మకుండా స్వయంగా విడుదల చేస్తున్నారని, నవంబర్ 27న మార్నింగ్ షోను ఉచితంగా చూడవచ్చని ప్రకటించారు.
డిస్ట్రిబ్యూటర్ అచ్చిబాబు మాట్లాడుతూ సినిమా కంటెంట్‌పై పూర్తి నమ్మకంతోనే తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నామని, కన్నడలో మాదిరిగానే తెలుగులోనూ డేంజర్ బాయ్స్ మంచి ఆదరణ పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దట్టమైన అడవి నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌గా, థియేటర్ అనుభవాన్ని ఇచ్చే చిత్రంగా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.